తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మ్యాచ్ మలుపు తిప్పింది: అక్షర్ పటేల్ - axar patel eng test series

ఇటీవల ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో అదరగొట్టిన అక్షర్ పటేల్.. తన వ్యక్తిగత విషయాల్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల పోత్సాహంతో పాటు క్రికెట్​ కెరీర్​ గురించి వెల్లడించాడు.

indian cricketer axar patel
అక్షర్ పటేల్

By

Published : Mar 14, 2021, 9:32 AM IST

Updated : Mar 14, 2021, 10:29 AM IST

ఏడేళ్ల కిందటే వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌తోనే సంచలనమయ్యాడు అక్షర్‌ పటేల్‌. తొలి సిరీస్‌లోనే బంతితో అద్భుతాలు చేసిన ఈ గుజరాతీ ఆఫ్‌ స్పిన్నర్‌ తన గురించి ఏం చెబుతాడంటే...

నాన్న ప్రోత్సాహంతోనే...

నాకపుడు 12 ఏళ్లు... ‘క్రికెట్‌ బాగా ఆడుతున్నావు. చదువు, క్రికెట్‌ రెంటిలో ఎటువైపు వెళ్లినా భవిష్యత్తు ఉంటుంది. ఏదో ఒకటి ఇప్పుడే ఎంచుకో’ అన్నారు నాన్న రాజేష్‌భాయ్‌. నేను క్రికెట్‌నే ఎంచుకున్నా. ఆ మర్నాడే మాకు దగ్గర్లోని ఖేడా పట్టణంలో అకాడమీ నడుపుతున్న తన స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్లి చేర్పించారు. అప్పట్నుంచీ క్రికెట్టే లోకం. స్థానిక టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి నాన్న దగ్గర డబ్బులు తీసుకుని మా జట్టు ఫీజు కట్టేవాణ్ని.

భారత బౌలర్ అక్షర్ పటేల్

మొదట బ్యాట్స్‌మన్‌...

క్రికెట్‌ అకాడమీలో ఉదయం పూట శిక్షణ, సాయంత్రం మ్యాచ్‌లు ఆడించేవారు. టెన్నిస్‌ బాల్‌తో మ్యాచ్‌లు ఆడేవాళ్లం. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ని. బంతిని చాలా బలంగా కొట్టేవాణ్ని. ఆఫ్‌ స్పిన్‌ వేసేవాణ్ని కూడా. అందుకే జట్టులోని మిగతా ఆటగాళ్లు నన్ను ‘జయసూర్య’ అనేవారు. గుజరాత్‌ అండర్‌-19 జట్టుకి ఎంపికైన సమయంలో బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లా. అక్కడ కోచ్‌లు నాలోని బ్యాట్స్‌మన్‌కంటే కూడా స్పిన్నర్‌ని మెరుగు పర్చుకోమన్నారు. తర్వాత నా దృష్టి బౌలింగ్‌ మీదకు మరల్చా.

బ్లాక్‌ కాఫీ పడాల్సిందే!

క్రికెటర్‌గా రోజూ వేకువనే నిద్ర లేచి శిక్షణ మొదలుపెట్టాలి. కొన్నిసార్లు లేవలేకపోయేవాణ్ని. ఈ విషయమే ఫ్రెండ్‌తో చెబితే బ్లాక్‌ కాఫీ తాగమన్నాడు. షుగర్‌, మిల్క్‌ లేకుండా తాగడం కష్టమే కానీ అలవాటు చేసుకున్నా.

మా ఊళ్లోనే ఉంటా!

అహ్మదాబాద్‌కి 60 కి.మీ. దూరంలోని నడియాథ్‌ మా సొంతూరు. నేనెప్పటికీ అక్కడే ఉంటా. నాకు ఊరితో అనుబంధం ఎక్కువ. సిటీలో సెటిలైతే నా బంధువులూ, స్నేహితులూ అందరూ నాతోపాటు రారు కదా.

నాన్న సంతోషపడ్డారు!

అమ్మానాన్నలకు ఒక్కణ్నే. దెబ్బలు తగులుతాయని చిన్నపుడు అమ్మ ప్రీతి క్రికెట్‌ ఆడనిచ్చేది కాదు. నాన్న అడ్డు చెప్పేవారు కాదు. టీ20లూ, వన్డేల్లో నేను ఇండియాకి ఆడడం చూసిన నాన్న... టెస్టుల్లో చూడరనుకున్నా. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఆయన తలకి బలమైన గాయమైంది. దాని ప్రభావం జ్ఞాపకశక్తిమీదా పడింది. ఏడాదిపాటు నేనే దగ్గరుండి చూసుకున్నా. ఇప్పుడు చాలావరకూ నయమైంది. టెస్టుల్లోనూ నేను ఆడటం చూసి నాన్న ఎంతో సంతోషపడ్డారు.

అక్షర్ పటేల్ తల్లిదండ్రులు

ఏడేళ్లుగా ఐపీఎల్‌...

జాన్‌రైట్‌ ‘ముంబయి ఇండియన్స్‌’ కోచ్‌గా ఉన్నపుడు విజయ్‌ సర్‌ చెప్పడంతో అహ్మదాబాద్‌ వచ్చి నన్ను పరీక్షించాక ఆ జట్టుకి ఎంపికచేశారు. తర్వాత పంజాబ్‌ జట్టుకి వెళ్లా. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నా. ఇండియా-ఎకి ఆడుతున్నప్పట్నుంచీ రిషబ్‌ పంత్‌ తెలుసు. స్పిన్నర్‌నే అయినా టెన్నిస్‌ బంతితో ఆడినప్పట్నుంచీ చాలా వేగంగా వేసేవాణ్ని. బ్యాట్స్‌మన్‌ని బెదరగొట్టడానికి పాదాలమీదకి వేసేవాణ్ని. ఆ వేగం, టర్న్‌ ఇప్పటికీ కొనసాగిస్తున్నా. అది చూసి సరదాగా ‘వసీమ్‌ భాయ్‌’ అని పిలుస్తాడు రిషబ్‌.

టర్నింగ్‌ పాయింట్‌...

2013లో దిల్లీ, గుజరాత్‌ల మధ్య సూరత్‌లో రంజీ మ్యాచ్‌. దిల్లీ జట్టులో సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, నెహ్రా లాంటి టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. నేను అప్పటికి గుజరాత్‌ అండర్‌-23 జట్టుతోపాటు అహ్మదాబాద్‌లో ఉన్నా. పిచ్‌ని గమనించిన కోచ్‌ విజయ్‌ పటేల్‌ నన్ను ఉన్నపళంగా సూరత్‌ పిలిచి ఆ మ్యాచ్‌లో ఆడించారు. దిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశా. బ్యాట్‌తోనూ రాణించి 38, 29 పరుగులు చేశా. ఆ మ్యాచ్‌ డ్రా అయింది. అప్పట్నుంచీ రంజీ జట్టులో నా స్థానం పదిలమైంది.

భారత బౌలర్ అక్షర్ పటేల్
Last Updated : Mar 14, 2021, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details