వెస్టిండీస్ మహిళా జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది టీమిండియా మహిళా జట్టు. ఒక్క పరుగు తేడాతో ఓడింది. ఫీల్డింగ్‌లో మెరిపించిన భారత స్టార్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్.. బ్యాటింగ్‌లో నిరాశపర్చింది.
హర్మన్ ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్
ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్(94; 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకుంది. ఏక్తా బిస్త్ వేసిన చివరి ఓవర్ ఆఖరు బంతిని టేలర్ భారీ షాట్ కొట్టగా.. అక్కడే ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకుంది. గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టింది. ఫలితంగా కరీబియన్ సారథి కెరీర్లో ఓ సెంచరీ చేసే అవకాశం కోల్పోయింది
టేలర్‌కు తోడుగా మెక్లెన్(51), చెడియాన్ నేషన్(43) రాణించారు. భారత బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పునియా(75; 107 బంతుల్లో 6 ఫోర్లు), రోడ్రిగ్స్( 41; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) శుభారంభం అందించారు. వీరిద్దరూ ఔటయ్యే సమయానికి 2 వికెట్ల నష్టానికి 169 పరుగులతో బలంగా కనిపించిన టీమిండియా... 55 పరుగులకే మిగతా 8 వికెట్లు సమర్పించుకుంది. విండీస్ సారథి స్టెఫానీ బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది. ఆనీశా 5 వికెట్లు తీసి కెరీర్లో 150 వికెట్ల మైలురాయి అందుకుని... ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
పూనమ్ రౌత్(22), దీప్తి శర్మ(19)లు తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్(5), భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్(20) బ్యాటింగ్‌లో విఫలం కావడం వల్ల గెలుపు అంచుల వద్ద భారత్ ఓడిపోవాల్సి వచ్చింది.
రెండో వన్డే(నవంబర్ 3) ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు స్మృతి మంధానా అందుబాటులోకి రానుంది. మూడో మ్యాచ్ (నవంబర్ 6) బుధవారం జరగనుంది. ఈ వన్డే సిరీస్ తర్వాత 5 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి ఇరుజట్లు.