షఫాలీ వర్మ.. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్లో మార్మోగుతున్న పేరు. వయసేమో 15 కానీ ఆట మాత్రం విధ్వంసమే. సెహ్వాగ్ తరహా దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోంది. దేశవాళీ మ్యాచ్‌ల్లో 150పైగా స్ట్రయిక్ రేటు నమోదు చేసింది. విదేశీ గడ్డపై ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. కరీబియన్ దీవుల్లో తనదైన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించింది.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో.. వేగంగా అర్ధశతకం చేసింది షఫాలీ. ఈ ఘనత సాధించిన పిన్న భారతీయురాలిగా (15 ఏళ్ల 285 రోజులు) రికార్డు సృష్టించింది. ఓవరాల్‌గా రెండో క్రీడాకారిణిగా నిలిచింది. యూఏఈకి చెందిన ఎగోడాగ్ (15 ఏళ్ల 267 రోజులు) తొలి స్థానంలో ఉంది. 30 ఏళ్ల క్రితం భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది.
ఆరంభం నుంచే అదుర్స్..
అనుభవం, వయసు తక్కువ క్రీడాకారిణులు క్రీజులో దిగిన వెంటనే నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షఫాలీ... 75 మ్యాచ్‌ల అనుభవం ఉన్న స్టార్ బౌలర్ షకీరా సెల్మన్ను అలవోకగా ఎదుర్కొంది. మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలు, సిక్సర్ బాదేసింది. మరో బౌలర్ హెన్రీ వేసిన ఓవర్లోనాలుగు ఫోర్లు, సిక్సర్‌తో26 పరుగులు సాధించింది. ఈ విధ్వంసానికి 4 ఓవర్లలో భారత్ స్కోరు 60కి చేరింది. కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి అబ్బురపరిచింది షఫాలీ. చివరికు 30 బంతుల్లో తన కెరీర్లో మొదటి అర్ధశతకం సాధించింది. మొత్తం 49 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు)చేసి ఔటయింది.