హరియాణా రోహ్తక్కు చెందిన షెఫాలీ వర్మ పేరు...క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అందరినోటా వినిపిస్తోంది. ఈ 16 ఏళ్ల బ్యాట్స్ఉమన్...అద్భుతమైన షాట్లతో అదరగొడుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ సైతం ఆమె ఆటకు ఫిదా అయ్యాడు. భారత మహిళా క్రికెట్జట్టులో అతిచిన్న వయసులోనే ప్రవేశించిన మొట్ట మొదటి ప్లేయర్‌గా రికార్డుకెక్కింది షెఫాలీ వర్మ. ఈ విజయం తనకు రాత్రికి రాత్రే రాలేదు.
"మొదట్లో అమ్మాయిల కోసం క్రికెట్ అకాడమీలు ఉండేవి కాదు. అబ్బాయిలతో కలిసి ఆడేదాన్ని. తర్వాత ఈ అకాడమీలో చేరాను. ఇక్కడికి సైకిల్‌పై వచ్చేదాన్ని. చాలా కష్టంగా ఉండేది. బడి అయిపోయిన తర్వాత అకాడమీకి రావడం కష్టంగా అనిపించేది. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రాక్టీస్ తర్వాత ఎవరికీ కనిపించకుండా కిట్‌ను లోపల దాచేదాన్ని. విరిగి పోయిన బ్యాట్‌తోనే ఆడేదాన్ని."
-షెఫాలీ వర్మ, క్రికెటర్
అబ్బాయిలకే ప్రాధాన్యమిచ్చే సమాజంలో ఆడపిల్ల పుట్టడమే ఓ పెద్దశాపంగా భావిస్తారు. అలాంటి పరిస్థితులతో పాటు.. పేదరికంతోనూ షెఫాలీ పోరాడాల్సి వచ్చింది. కుమార్తె గురించి మాట్లాడే సమయంలో.. షెఫాలీ తండ్రి కళ్లు చెమర్చుతాయి, స్వరం గద్గదంగా మారుతుంది. తడబడుతున్న గొంతుతోనే...కుమార్తె పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు.
"చాలా కష్టపడ్డాం. ఉదయం ఐదింటింకే లేచి, 3గంటలు ప్రాక్టీసు చేసేది. తర్వాత బడికి వెళ్లేది. అకాడమీకి వెళ్లి, రాత్రి 11, 12 గంటల వరకు సాధన చేసేది. అప్పుడు మా పరిస్థితి దయనీయంగా ఉండేది. 4 నెలలైతే ఎలా గడిపామో తెలియదు. బ్యాట్, గ్లవ్స్ కావాలని కూడా అడగలేదు. బ్యాట్ వేరే వాళ్లది అడిగి ఆడించేవాళ్లం. ఇప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం. భగవంతుడి ఆశీస్సులు మాకు దక్కాయి."