తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల టీ20 ప్రపంచకప్‌: భారత్​కు ఓ కప్పు కావాలి - మహిళల టీ20 ప్రపంచకప్‌ వార్తలు

ప్రపంచ క్రికెట్​ను ఓ వైపు భారత పురుషుల జట్టు శాసిస్తుంటే... మరోవైపు మహిళల జట్టు మాత్రం ఇంకా గుర్తింపు కోసం తహతహలాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరో రెండు రోజుల్లో ప్రపంచ కప ప్రారంభం కానుంది. ఇందులో అయినా విజేతగా నిలిచి కప్పు గెలిస్తే.. భారత మహిళా క్రికెట్​ రూపురేఖలు మారే అవకాశముంది. అందుకే అందరూ వీరికి ఓ కప్పు రావాలని ఆశిస్తున్నారు.

ICC Women's T20 World Cup 2020
ఓ కప్పు కావాలి: మహిళల టీ20 ప్రపంచకప్‌.. 2 రోజుల్లో

By

Published : Feb 19, 2020, 8:43 AM IST

Updated : Mar 1, 2020, 7:31 PM IST

భారత క్రికెట్‌ది దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర! కానీ మనోళ్ల ఆటకు కళ వచ్చింది 1983లో. అంతకుముందు మనోళ్లు లెక్కలేనన్ని మ్యాచ్‌లు ఆడారు. గొప్ప గొప్ప ప్రదర్శనలు చేశారు. ఎన్నో విజయాలూ సాధించారు! కానీ అవేవీ లెక్కలోకి రాలేదు.

కప్పు గెలిచాకే కథ మలుపు తిరిగింది. అక్కడి నుంచి దేశం క్రికెట్‌ మత్తుతో ఊగిపోసాగింది. క్రమంగా ఈ ఆట ఒక మతంలా మారింది. ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన భారత క్రికెట్‌.. క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది.

అయితే ఓవైపు పురుషుల క్రికెట్‌ ఇలా వెలిగిపోతుంటే.. మహిళల క్రికెట్‌ కోసం కనీస గుర్తింపు కోసం ఏళ్లుగా తపిస్తోంది. గత కొన్నేళ్లలో కొంత ఆదరణ పెరిగినా.. పురుషుల్లా తమ ఆటనూ అభిమానులు చూడాలన్న ఆశ అమ్మాయిలది. ఈ మార్పు ప్రపంచకప్‌ విజయంతోనే సాధ్యమవుతుందన్నది క్రికెట్‌ ప్రేమికుల మాట.

హర్మన్​ సారథ్యంలోని మహిళా టీమిండియా

"భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచిందంటే 1983లో కపిల్‌ డెవిల్స్‌ కప్పు గెలిచాక భారత క్రికెట్‌కు ఏం జరిగిందో.. అమ్మాయిల ఆటలో అలాంటి మార్పే చోటు చేసుకుంటుంది. టైటిల్‌ గెలిస్తే వాళ్లు సూపర్‌ స్టార్లవుతారు" ప్రస్తుత మహిళల జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ వ్యాఖ్యలివి! అతడు అన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు! ఏ ఆటలో అయినా.. పురుషులు గెలిచినా, మహిళలు గెలిచినా.. ప్రపంచకప్‌ విజయం ప్రత్యేకం! అందులోనూ విపరీతమైన పోటీ ఉండే క్రికెట్లో అంటే ఆ విజయాన్ని ఇంకా ప్రత్యేకంగా చూస్తారు.

ఇప్పటికీ ఒక కప్పు రాలేదు..

1978లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ ఆడినప్పటి నుంచి 2018లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ దాకా మహిళల జట్టుకు ఈ ప్రత్యేక విజయం సొంతం కాలేదు. మహిళల క్రికెట్‌ను ఎవరూ పట్టించుకోని సమయంలో 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరింది భారత్‌. అప్పుడు కప్పు గెలిస్తే పరిస్థితి ఎలా ఉండేదో ఏమో మరి! అప్పట్లో మహిళలు క్రికెట్‌ ఆడితే ఆదాయం రాకపోగా సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులుండేవి. సరైన వసతులు, ఆదాయం లేని సమయంలో మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి లాంటి వాళ్లు ఎంతో కష్టపడి ఆటలో కొనసాగారు. ఓమాదిరిగా అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

ప్రపంచకప్​తో అన్ని దేశాల మహిళా సారథులు

బీసీసీఐ పరిధిలోకి వచ్చే వరకు జనాలు అమ్మాయిల ఆటను పెద్దగా పట్టించుకునేవాళ్లే కాదు. బోర్డు గొడుగు కిందికి వచ్చాక కూడా మహిళల క్రికెట్‌ ఒక స్థాయిని అందుకోవడానికి, అభిమానుల దృష్టి తమపై పడేలా చేసుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన లాంటి దూకుడైన తర్వాతి తరం క్రికెటర్లు ఆటలోకి అడుగు పెట్టాక అమ్మాయిల ఆటకు ఆకర్షణ పెరిగింది.

ఆ టోర్నీ మలుపు..:

భారత మహిళల క్రికెట్లో గొప్ప మలుపు అంటే.. 2017 వన్డే ప్రపంచకప్‌. అభిమానులు పురుషుల మ్యాచ్‌లను చూసినట్లు ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లను చూశారు. ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిన సెమీస్‌ మ్యాచ్‌ అయితే వీక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఫైనల్‌ను చాలా ఉత్కంఠగా చూశారందరూ. అప్పుడు కప్పు గెలిస్తే ఆ ఊపే వేరుగా ఉండేది. మిథాలీసేన ఫైనల్లో ఓడిపోతే.. పురుషులు కప్పు ఓడినంతగా బాధపడ్డారు అభిమానులు. తర్వాతి ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శనే చేసింది. సెమీస్‌లో మిథాలీని తప్పించి, ఓటమి పాలవడం వివాదాస్పదమైంది.

గత రెండేళ్లలో అమ్మాయిలు బాగానే ఆడారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేనపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌ల సమయంలో మాత్రమే ఇటు చూస్తున్న అభిమానులు.. మధ్యలో జరిగే సిరీస్‌లనూ ఆసక్తిగా చూసేలా చేయాలంటే, అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ ఇంకా పెంచాలంటే అది ప్రపంచకప్‌ విజయంతోనే సాధ్యం. ఆస్ట్రేలియాలో పొట్టి కప్పును గెలిస్తే రామన్‌ అన్నట్లు కపిల్‌ సేన స్థాయిలో మార్పు తేలేకపోయినా.. అమ్మాయిల ఆటకు ఆకర్షణ పెంచగలరనడంలో మాత్రం సందేహం లేదు.

ఓ ధోనీ, దాదా, సెహ్వాగ్..

క్రికెట్లో ఎక్కువగా అభిమానుల దృష్టిని ఆకర్షించేది విధ్వంసకారులే! ధనాధన్‌ ఆటకే పట్టం కడుతున్నారిప్పుడు. మహిళల క్రికెట్‌ ముందుకు సాగాలన్నా దూకుడుగా ఆడే బ్యాటర్ల అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడైతే ఈ విషయంలో భారత జట్టుకు లోటుండేది కానీ.. ఇప్పుడా ఇబ్బంది లేదు. గత కొన్నేళ్లలో మహిళలు కూడా బాగానే దూకుడును అందిపుచ్చుకున్నారు.

హర్మన్​ప్రీత్​ కౌర్​

ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. భారత జట్టులోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ స్ట్రోక్‌ ప్లేయర్లలో ఒకరు. పురుషులతో సమానంగా షాట్లు ఆడగల నైపుణ్యం ఆమె సొంతం. ఆమె ఆడే గోల్ఫ్‌ షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. 2017 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో హర్మన్‌ ఇన్నింగ్స్‌ను అంత సులువుగా ఎవరూ మరిచిపోలేరు. ధోనీ తరహాలో ఆట, కూల్​ కెప్టెన్సీ ఈమె సొంతం.

స్మృతి మంధాన

హర్మన్‌ తర్వాత జట్టులో అంత దూకుడుగా, నిలకడగా ఆడే బ్యాటర్‌ స్మృతి మంధాన. ఆమెకున్న ఆకర్షణే వేరు. ఎడమచేతి వాటంతో ఆడే స్మృతిని అభిమానులు 'లేడీ గంగూలీ' అంటారు. ఓపెనర్‌ అయిన ఆమె తరచుగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతుంటుంది.

షఫాలీ వర్మ

టీనేజీ అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ కూడా దూకుడైన బ్యాటరే. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో త్వరగానే మంచి గుర్తింపు సాధించింది. ఇక షఫాలీ వర్మ మహిళల క్రికెట్లో తాజా సంచలనం. ఇప్పటిదాకా భారత మహిళల క్రికెట్లో ఇంత దూకుడైన బ్యాటర్‌ను ఎవ్వరూ చూసి ఉండరు. ఆమెది సెహ్వాగ్‌ శైలి. ప్రతి బంతికీ బౌండరీ కొట్టాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచింది. ఈ బ్యాటర్లు ఈ తరం క్రికెట్‌ అభిమానుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నారు. ప్రపంచకప్‌ లాంటి టోర్నీలో వీళ్లు సత్తా చాటితే, జట్టుకు కప్పు అందిస్తే.. అభిమానులు అమ్మాయిలు ఆడే ప్రతి మ్యాచ్‌నూ అనుసరించడం మొదలుపెడతారనడంలో సందేహం లేదు.

Last Updated : Mar 1, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details