తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియన్ 'పటాకా' లీగ్ జట్ల బలాబలాలు ఇవే..! - mumbai indians

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్​) ప్రారంభానికి సిద్ధమవుతోంది. పొట్టి క్రికెట్​లో తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రెండు నెలలు అలరించే ఈ మెగా సంగ్రామంలో తలపడే జట్ల వివరాలు.. వారి బలాలు, బలహీనతలపై ఓసారి లుక్కేద్దాం.

ఐపీఎల్

By

Published : Mar 22, 2019, 10:10 PM IST

ఐపీఎల్​ మొదలైందంటే తమ జట్టే గెలుస్తుందంటూ ప్రతి అభిమాని ఆశిస్తాడు. కానీ చివరికొచ్చే సరికి ఎవరో ఒకరినే టైటిల్ వరిస్తుంది. ముంబయి, చెన్నై చెరో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. కోల్​కతా, హైదరాబాద్ జట్లు రెండు సార్లు గెలుచుకున్నాయి. మరి ఈసారి బరిలోకి దిగుతున్న జట్లకున్న బలాలు, బలహీనతలూ చూసేద్దామా..!

రాజస్థాన్ రాయల్స్

2008 ప్రారంభ ఐపీఎల్​లోనే విజేతగా నిలిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. 2015, 2018లలో ప్లే ఆఫ్ చేరడం మినహా మిగతా సీజన్లలో అంతగా ఆకట్టుకోలేక పోయింది.

రాజస్థాన్ రాయల్స్​
  1. బలాలు:ఐసీసీ విధించిన ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తోన్న స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం. అజింక్యా రహానే, సంజు శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్​ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్​లో క్రిష్ణప్ప గౌతమ్, ఇష్ సోధి, శ్రేయాస్ గోపాల్ లాంటి స్పిన్నర్లున్నారు.
  2. బలహీనతలు: అజింక్యా రహానె ఫామ్ అందుకోవడం ముఖ్యం. ఏడాది కాలంగా టీట్వంటీ క్రికెట్​లో స్థిరంగా ఆడట్లేదు. పేస్​ విభాగంలో జట్టు కొంచెం బలహీనంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్​బౌలర్ లేడు. గత సీజన్​లో ఎక్కువ ధర పెట్టి తీసుకున్న జయదేవ్ ఉనాద్కట్ నిరాశపరిచాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2014లో రన్నరప్​గా నిలిచింది పంజాబ్​ జట్టు. తొలి సీజన్​లో సెమీస్ వరకు చేరింది. ఈ రెండు సార్లు మినహా ఐపీఎల్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతిసారి కెప్టెన్లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం రాలేదు.

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​
  1. బలాలు: అనుభవం గల రవిచంద్రన్ అశ్విన్ జట్టును నడిపించనున్నాడు. గతేడాది కూడా కెప్టెన్​గా మెప్పించాడీ లెగ్ స్పిన్నర్. అశ్విన్​తో కలిసి స్పిన్​ బౌలింగ్​లో ముజిబర్ రెహమాన్ కీలక పాత్ర పోషించనున్నాడు. రాహుల్, గేల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్​లతో బ్యాటింగ్​లో దుర్భేద్యంగా ఉంది. రాహుల్ గత సీజన్​లో 659 పరుగులు చేసి ఆకట్టుకోగా, గేల్ 368 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ ఈ జట్టుకు కీలకం కానున్నారు.
  2. బలహీనతలు: ఆల్​రౌండర్లు ఆండ్రూ టై, హెండ్రిక్స్ సగం మ్యాచ్​ల​కే అందుబాటులో ఉంటారు. మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఫామ్ అందుకోవడం అవసరం.

దిల్లీ క్యాపిటల్స్
తొలి రెండు సీజన్లు మినహా మిగతా టోర్నీల్లో ప్లే ఆఫ్స్​కి కూడా చేరలేదు. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో ఉంది క్యాపిటల్ జట్టు.

దిల్లీ క్యాపిటల్స్
  1. బలాలు: రికీ పాంటింగ్ దిల్లీ జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తుండటం ప్రధాన బలం. హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్ రాకతో బ్యాటింగ్​లో బలంగా కనిపిస్తోంది. పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్​ లాంటి టీ 20 స్పెషలిస్టులు జట్టులో ఉన్నారు. బౌలింగ్​ రబాడా, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. ఆలౌరౌండర్లు క్రిస్ మోరిస్, హనుమ విహారి, అక్షర్ పటేల్​లతో సమతూకంగా ఉంది.
  2. బలహీనతలు: సరైన దేశీయ టీ20 బౌలర్ లేకపోవడం పెద్దలోటు. ఇషాంత్ శర్మ తప్ప చెప్పకోదగ్గ దేశవాళీ బౌలర్ కనిపించట్లేదు.


కోల్​కతా నైట్ రైడర్స్
గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 ఏడాది టైటిళ్లను ఎగరేసుకుపోయింది కోల్​కతా నైట్​రైడర్స్​. గత సీజన్​లో గంభీర్ దిల్లీకి ప్రాతినిధ్యం వహించగా.. దినేశ్ కార్తీక్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

కోల్ కతా
  1. బలాలు: దినేశ్ కార్తీక్ గత సీజన్​లో 498 పరుగులు చేసి జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఓపెనర్లు క్రిస్​ లిన్, సునీల్ నరైన్​ జట్టుకు అదనపు బలం. ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సమర్థులు. సునీల్ నరైన్, కుల్​దీప్​ యాదవ్ లాంటి అంతర్జాతీయ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. మిడిల్ ఆర్డర్​లో ఆండ్రూ రసెల్, బ్రాత్​వైట్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
  2. బలహీనతలు: గత సీజన్​లో పేస్ విభాగం కొంచెం బలహీనతగా ఉంది. విండీస్ ఆల్​రౌండర్ బ్రాత్​వైట్, రసెల్ ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపలేదు. ఈసారి వీరు ఎంత వరకు జట్టు గెలుపునకు కృషి చేస్తారన్నది తెలియాలి.

సన్​రైజర్స్ హైదరాబాద్
2013లో తొలిసారి ఐపీఎల్​లో ప్రవేశించిన సన్​రైజర్స్ జట్టు తొలి సీజన్​లోనే ప్లే ఆఫ్స్​కి చేరింది. 2016లో టైటిల్ నెగ్గి సత్తా చాటి.. గతేడాది రన్నరప్​గా నిలిచింది.

హైదరాబాద్
  1. బలాలు: డేవిడ్ వార్నర్ పునరాగమనం చేస్తుండటం జట్టుకు కలిసొస్తుంది. మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్​లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కౌల్, ఖలీల్ అహ్మద్​లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. గత రెండు సీజన్​లలో ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ ఆటగాళ్లకే దక్కడం (వార్నర్, విలియమ్స్​న్) విశేషం.
  2. ​​​​​​​బలహీనతలు: మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, సాహాలు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు
2009, 2011, 2016 టోర్నీల్లో మూడు సార్లు ఫైనల్​కి వెళ్లి రన్నరప్​తో సరిపెట్టుకుంది. దిగ్గజాలకు కొదవలేకున్నా ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఈ సారి టైటిల్ ఫేవరేట్​గా బరిలో దిగుతోంది.

బెంగళూరు
  1. బలాలు: బెంగళూరుకి ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీ. డివిలియర్స్, హెట్మైర్, మొయిన్​ అలీ, స్టాయినీస్, గ్రాండ్​ హోమ్​ లాంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. బౌలింగ్​లో సౌధి, చాహల్, ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు.​​​​​​​​​​​​​​
  2. బలహీనతలు: విరాట్​పైనే ఎక్కువగా ఆధారపడటం, సుస్థిరత లేకపోవడం బెంగళూరు జట్టుకున్న ప్రధాన సమస్య. బ్యాటింగ్​లో సత్తా చాటుతున్నా.. బౌలింగ్​లో ఇబ్బంది పడుతోంది.

ముంబయి ఇండియన్స్
మూడుసార్లు(2013, 2015, 2017) కప్పు గెలుచుకుంది ముంబయి. నాలుగోసారి ట్రోఫీ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

ముంబయి
  1. బలాలు: రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆ జట్టుకు ప్రధాన బలం. డికాక్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలతో టాప్​ ఆర్డర్ బలంగా ఉంది. పాండ్యా సోదరులు, పోలార్డ్​ మిడిల్ ఆర్డర్లో రాణిస్తున్నారు. బుమ్రా, మయాంక్ మార్ఖండేలతో బౌలింగ్​లోనూ బాగుంది. మ్యాక్స్​వెల్, యువరాజ్ రాక బ్యాటింగ్​లో జట్టుకు అదనపు బలం చేకూర్చనుంది.
  2. బలహీనతలు: ముంబయి ప్రధాన సమస్య సుస్థిరత లేకపోవడం. గత సీజన్​లో మయాంక్ మార్ఖండే మొదట్లో ఆకట్టుకున్నా తర్వాత విఫలమయ్యాడు. యువరాజ్, పోలార్డ్, మిచెల్ మెక్లెగాన్ ఫామ్ అందుకోవాలి.

చెన్నై సూపర్​ కింగ్స్
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్​లో ప్లే ఆఫ్​కి చేరిన ఏకైక జట్టు చెన్నై. మూడు సార్లు విజేత.. ఏడు సార్లు రన్నరప్​గా నిలిచి విజయవంతమైన టీమ్​గా పేరుగాంచింది.

చెన్నై
  1. బలాలు: కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీ వ్యూహాలు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలం. అంబటి రాయుడు, సురేశ్ రైనా, ధోనీలతో మిడిల్​ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్​లో బ్రేవో, శార్దుల్ ఠాకూర్, ఎంగిడి, మోహిత్ శర్మలు ఆకట్టుకుంటున్నారు. హర్భజన్ సింగ్, తాహిర్ లాంటి అనుభవం గల స్పిన్నర్లున్నారు.​​​​​​​​​​​​​​​
  2. బలహీనతలు: జట్టులో ఎక్కువ మంది రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నవాళ్లే. చూడటానికి బలంగా ఉన్నప్పటికీ ప్రదర్శనలో లోటు కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details