భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ బంతి పట్టనున్నాడు. కేరళ క్రికెట్ సంఘం నిర్వహించే స్థానిక టీ20 టోర్నీలో ఆడనున్నాడు. దాదాపుగా ఏడేళ్ల తర్వాత అతడు మళ్లీ పోటీ క్రికెట్ ఆడుతుండటం గమనార్హం.
ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడని శ్రీశాంత్‌పై బీసీసీఐ శాశ్వత నిషేధం విధించింది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, నిర్దోషినని అతడు న్యాయ పోరాటం చేశాడు. స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. ఏడేళ్ల తర్వాత విజయం సాధించాడు. ఈ సెప్టెంబర్లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో అళపులలో నిర్వహించే టీ20 టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
కేరళ రంజీ క్రికెటర్ సచిన్ బేబీ సారథ్యం వహిస్తున్న కేసీఏ టైగర్స్‌కు శ్రీశాంత్ ఆడనున్నాడు. వారే కాకుండా బాసిల్ థంపి, రోహిన్ ప్రేమ్, మిధున్ ఎస్, కేఎం ఆసిఫ్ వంటి సీనియర్ ఆటగాళ్లు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ అనే ఆరు జట్లు పోటీపడతాయి.
యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా టోర్నీని నిర్వహిస్తామని కేసీఏ చెప్పింది. ఫ్రాంచైజీలేమీ ఉండవంది. ప్రతి జట్టులో 14 మంది ఆటగాళ్లు, ఇద్దరు సహాయ సిబ్బంది ఉంటారంది. అవసరం మేరకు మరో నలుగురు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు.