దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఐదు వికెట్లతో సత్తా చాటాడు మహ్మద్ షమి. తనదైన పేస్ బౌలింగ్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత షమిపై ప్రశంసల జల్లు కురిపించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. భవిష్యత్తులో తనకున్న రివర్స్ స్వింగ్ టెక్నిక్‌తో కింగ్ బౌలర్ అవుతాడని అన్నాడు.
" ప్రపంచకప్ తర్వాత షమి నాకు ఫోన్ చేశాడు. అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయానని కాస్త నిరాశపడ్డాడు. నీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఫిట్నెస్ మీద దృష్టిపెట్టు అని సూచించా. త్వరలో జరగనున్న టెస్టుల్లో సత్తా చాటు అని సలహా ఇచ్చాను. విశాఖ టెస్టులో అతడు వికెట్లతో చెలరేగిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంది. దాన్ని వినియోగించుకోమని షమికి చెప్పాను. ఇలానే తన ప్రదర్శన కొనసాగిస్తే తనకున్న రివర్స్ స్వింగ్‌తో భారత జట్టు కింగ్ బౌలర్‌గా మారతాడు ".
-- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్