తెలంగాణ

telangana

ETV Bharat / sports

గత అక్టోబర్​ నుంచి భారత క్రికెటర్లకు జీతాల్లేవ్! - బీసీసీఐ ఐపీఎల్ వార్తలు

ప్రపంచంలోని ధనిక క్రికెట్​ బోర్డుల్లో బీసీసీఐ ఒకటి. అలాంటి యాజమాన్యం గతేడాది అక్టోబర్​ నుంచి ఆటగాళ్లకు జీతాలు ఇవ్వట్లేదట. ఆటగాళ్లకు బోర్డు రూ.99 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం.

గత అక్టోబర్​ నుంచి భారత క్రికెటర్లకు జీతాల్లేవ్!
భారత క్రికెటర్లు

By

Published : Aug 2, 2020, 4:29 PM IST

Updated : Aug 2, 2020, 4:45 PM IST

ప్రపంచంలో ఉన్న పలు దేశాల క్రికెట్​ బోర్డుల్లో బీసీసీఐకి ప్రత్యేక స్థానం ఉంది. ధనిక, క్యాష్​ రిచ్​ లీగ్​ ఐపీఎల్​ నిర్వహించే బోర్డుగా మంచి పేరుంది. అలాంటిది 27 మంది జట్టు ఆటగాళ్లకు గతేడాది అక్టోబర్​ నుంచి జీతాలు చెల్లించట్లేదట. త్రైమాసికానికి ఒకసారి వాళ్లకు ఇచ్చే చెల్లింపులన్నీ ప్రస్తుతం ఆగిపోయినట్లు ఓ మీడియా నివేదిక ద్వారా వెల్లడైంది.

స్టార్​ ఆటగాళ్లకు

అక్టోబర్​ నుంచి భారత క్రికెటర్లు.. మొత్తం రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడారు. ఫలితంగా ప్లేయర్లకు రూ.99 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటికీ వాటిని ఇవ్వలేదని సమాచారం.

గ్రేడ్​ ఏ+ క్యాటగిరీలో కెప్టెన్ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్ప్రీత్​ బుమ్రా ఉన్నారు. వీళ్లకు ప్రతి ఏటా రూ.7 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రేడ్​ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్ల చొప్పున, గ్రేడ్​ బీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్​ సీలో ఉన్న వాళ్లకు రూ.1 కోటి చొప్పున బోర్డు చెల్లిస్తుంది.

భారత క్రికెటర్లు కోహ్లీ-జడేజా-చాహల్

టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్​కు రూ.3లక్షల మ్యాచ్​ ఫీజు ఉంటుంది. 2018 మార్చి నాటికి బీసీసీఐ బ్యాంక్​లో రూ. 5,526 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.2,992 కోట్లు ఫిక్స్​డ్​ డిపాజిట్​గా ఉన్నాయి. 2018 ఏప్రిల్​ నుంచి బీసీసీఐకి రూ.6,138 కోట్లను ఇన్​స్టాల్​మెంట్ల రూపంలో చెల్లించింది ప్రసారదారు సంస్థ. అయితే ఇంత ఆదాయం ఉన్న జీతాలు చెల్లించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఝార్ఖండ్​, ముంబయి, బంగాల్​, జమ్ము కశ్మీర్​, పుదుచ్చేరి, బరోడా, రైల్వేస్, రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​,చత్తీస్​గఢ్​కు చెందిన దేశవాళీ ఆటగాళ్ల ఫీజులు కూడా ఇప్పటికీ చెల్లించలేదట.

ఇదే కారణమా?

ఆటగాళ్లకు జీతాలు చెల్లించకపోవడానికి చీఫ్​ ఫైనాన్సిల్​ ఆఫీసర్​ పదవి డిసెంబర్​ నుంచి ఖాళీగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. కీలక పదవులైన చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​, జనరల్​ మేనేజర్​(క్రికెట్​ వ్యవహారాలు) పోస్టులు కూడా జులై నుంచి ఖాళీగానే ఉన్నాయి.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. లోథా కమిటీ నిబంధనల ప్రకారం వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. అయితే బీసీసీఐ రాజ్యంగం మార్పు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది బోర్డు. కూలింగ్​ పీరియడ్​ను తొలగిస్తే గంగూలీ, జై షా.. ఆయా పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ చక్కబడ్డాక దాదా యాజమాన్యం వీటన్నింటిపై దృష్టిపెట్టొచ్చని తెలుస్తోంది.

ఆగస్టు 2న ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​.. మెగాటోర్నీ 13వ సీజన్​ నిర్వహణ, షెడ్యూల్​పై నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్​-నవంబర్​ మధ్య యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీ ఏర్పాట్లపైనా సమీక్షించనుంది.

Last Updated : Aug 2, 2020, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details