టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌజ్ మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ పేసర్ సిరాజ్ శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఆసీస్‌లో బయోబబుల్‌లో ఉండటం వల్ల అతడు అంత్యక్రియలకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో సత్తాచాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిరాజ్ ఎంపికైన సంగతి తెలిసిందే.
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు పితృవియోగం
భారత యువ పేసర్, తెలుగుతేజం మహ్మద్ సిరాజ్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మహ్మద్ గౌజ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా గౌజ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్ భారత క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి కీలకపాత్ర పోషించాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్ కలను ప్రోత్సహించాడు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకోవడం వల్ల సిరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకున్న అతడు నిలకడైన ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతాతో జరిగిన ఓ మ్యాచ్‌లో బెంగళూరు తరఫున సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక, ఒక్కపరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.