తెలంగాణ

telangana

ETV Bharat / sports

రివ్యూ 2019: శుభారంభం చేసి.. ఘనంగా ముగించింది - Rohit

టీమిండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. అన్ని విభాగాల్లో రాణించి అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ఘనత సాధించింది. బ్యాటింగ్​లో రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ విజృంభించగా.. బౌలింగ్​లో బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేశ్ యాదవ్​ లాంటి బలమైన పేస్ దళంతో సత్తాచాటింది భారత్​.

Indian Cricket in 2019: Topping Tests, World Cup Disappointment, and Building for T20s
భారత క్రికెట్ జట్టు

By

Published : Dec 31, 2019, 5:33 AM IST

2019.. టీమిండియాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రపంచకప్ (సెమీస్​లో నిష్క్రమణ) మినహా మిగతా సిరీస్​ల్లో భారత జట్టు చక్కటి ప్రదర్శన చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్​ ర్యాంకుతో ఈ ఏడాదిని ముగించగా.. వన్డేల్లో రెండో స్థానంలో నిలిచింది. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​పై దృష్టిపెట్టింది. ఈ మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

టెస్టుల్లో..

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ నెగ్గి.. ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది టీమిండియా. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. అనంతరం వెస్టిండీస్(3-0), దక్షిణాఫ్రికా(3-0), బంగ్లాదేశ్​(2-0)పై వరుస విజయాలు సాధించి సిరీస్​లు క్లీస్ స్వీప్ చేసింది. ఫలితంగా టెస్టు ఛాంపియన్​షిప్​లో 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలచింది. రెండేళ్లుగా దీర్ఘకాలిక ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న కోహ్లీసేన.. గత ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​ జట్లనూ భయపెట్టింది.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్​ క్రికెట్​ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు ఉదాహరణే.. డే అండ్ నైట్ టెస్ట్​. తొలిసారి పింక్ టెస్టు ఆడిన భారత్​.. బంగ్లాపై అఖండ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా టెస్టుల్లో రోహిత్ ఓపెనర్ అవతారమెత్తి మూడు శతకాలు బాదేశాడు. ఇందులో దక్షిణాఫ్రికాపై చేసిన డబుల్ శతకం ఎంతో ప్రత్యేకం.

భారత టెస్టు జట్టు

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళమున్న జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది టీమండియా. బుమ్రా కొన్ని మ్యాచ్​లకు దూరమైనప్పటికీ మిగిలిన బౌలర్లు భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

మహ్మద్ షమీ(8 మ్యాచ్​ల్లో 33వికెట్లు) ఈ ఏడాది అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి తర్వాత ఇషాంత్ శర్మ(6 మ్యాచ్​ల్లో 25 వికెట్లు), ఉమేస్ యాదవ్(4 మ్యాచ్​ల్లో 23 వికెట్లు) ఉన్నారు.

బ్యాటింగ్​లో మయాంక్ అగర్వాల్​ 8 మ్యాచ్​ల్లో 754 పరుగులు, అజింక్య రహానే 642, విరాట్ కోహ్లీ 612 పరుగులతో మంచి ప్రదర్శన చేశారు. వచ్చే ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో పర్యటించనుంది కోహ్లీ సేన.

వన్డేల్లో..

2019లో టీమిండియాకు వన్డే ప్రపంచకప్​లో నిరాశే మిగిలింది. హాట్​ ఫెవరెట్​గా బరిలో దిగి న్యూజిలాండ్(సెమీస్) చేతిలో పరాజయం పాలైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల గుండె పగిలింది. ప్రపంచకప్​ అనంతరం భారత్ రెండు వన్డే సిరీస్​లు మాత్రమే ఆడింది. వెస్టిండీస్​తో జరిగిన ఆ రెండు 50 ఓవర్ల సిరీస్​ల్లో భారత్​దే విజయం.

అయితే ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహం పారించారు. నువ్వా-నేనా అన్న రీతిలో ప్రత్యర్థులపై విజృంభించారు. వన్డేల్లో అత్యధిక పరుగులతో రోహిత్ శర్మ ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించగా.. తర్వాతి స్థానంలో విరాట్ ఉన్నాడు. 27 ఇన్నింగ్స్​ల్లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. కోహ్లీ 25 ఇన్నింగ్స్​ల్లో 1377 పరుగులతో ఆకట్టుకున్నాడు.

భారత వన్డే జట్టు

బౌలింగ్ విభాగంలో ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడింది టీమిండియా. ఇటీవల వెస్టిండీస్​తో జరిగిన వన్డే సిరీసే ఇందుకు ఉదాహరణ. విండీస్​ స్కోర్​ బోర్డు చూస్తే బుమ్రా లేని లేటు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ ఏడాది 28 వన్డేలాడిన కోహ్లీసేన.. 19 విజయాలందుకోగా.. 8 మ్యాచ్​ల్లో ఓడింది. ఓ మ్యాచ్​లో ఫలితం తేలలేదు.

టీ20ల్లో..

పొట్టి ఫార్మాట్లో టీమిండియా మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ.. ఇంకా పుంజుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఏడాది 16 మ్యాచ్​లాడిన భారత్​.. 9 టీ20ల్లో గెలిచి.. ఏడింటిలో ఓడింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో నిలకడగా ఆడటం అలవర్చుకోవాలి. మొదట బ్యాటింగ్ చేసినపుడు కోహ్లీ సేన తడబడుతోంది. రోహిత్ శర్మ, కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ఫార్మాట్లో వీరిద్దరే టాప్ స్కోరర్లు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

భారత టీ20 జట్టు

2020 ఎలా ఉండబోతుంది..!

ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించిన టీమిండియా.. 2020లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. జనవరి తొలి వారంలోనే శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనున్న కోహ్లీసేన.. కొత్త సంవత్సరాన్ని శుభారంభం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఉంది. ఆ వెంటనే న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. కొంత విరామం అనంతరం.. ఆటగాళ్ల కోసం ఐపీఎల్‌ సిద్ధంగా ఉంటుంది.

మళ్లీ జూన్‌లో శ్రీలంకతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఉంటుంది. ఇక ఆగస్టులో జింబాబ్వే పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌, సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ ఉన్నాయి. తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగాభారత్​.. మూడు టీ20, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అలాగే ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ ఉంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా ఆ తర్వాత నవంబర్‌లో ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఇలా చూస్తే 2020లోనూ టీమిండియా బిజీబిజీగా గడపనుంది.

ఇదీ చదవండి: 2020 నుంచి నాలో ఇంకొకరిని చూస్తారు: కార్తీక్​

ABOUT THE AUTHOR

...view details