ప్రపంచ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్... కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టుకు ఈ సేవలందించనున్నాడు. మరోవైపు ప్రత్యర్థి జట్టుకు మరో దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కోర్ట్నే వాల్ష్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇతడు షేన్ వార్న్ సారథ్యంలోని జట్టుకు తర్ఫీదు ఇవ్వనున్నాడు. సచిన్-కోర్ట్నే ఒక్కరోజే ఈ బాధ్యతల్లో కనిపించనున్నారు. స్టీవ్ వా, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మేల్ జోన్స్.. వ్యాఖ్యాతలుగా ఆకట్టుకోనున్నారు.
ఫిబ్రవరి 8న 'బుష్ఫైర్ క్రికెట్ బాష్'లో భాగంగా ఇది సాధ్యం కానుంది. ఈ ఛారిటీ మ్యాచ్ ద్వారా వచ్చిన నిధులను ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధిత కుటుంబాలకు అందించనున్నారు.
మూడు ప్రధాన మ్యాచ్‌లు...
బుష్ ఫైర్ క్రికెట్ బాష్‌తో పాటు ఆస్ట్రేలియా-భారత్ మధ్య మహిళల టీ20, బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ ద్వారా వచ్చిన విరాళాలను కూడా ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌కు అందజేయనున్నారు. సచిన్ కోచ్‌గా పనిచేయనున్న 'బుష్ ఫైర్ క్రికెట్ బాష్' మ్యాచ్... బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ ముందు జరగనుంది. జనవరి 31న ఈ మ్యాచ్ వేదికను ప్రకటిస్తారు.