"డేనైట్ టెస్టు గులాబి బంతితో మనకి అచ్చిరాదు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పిచ్‌ల్లో వారికి కలిసొస్తుంది.. స్పిన్నర్లు ప్రభావం చూపలేరు." ఇవన్నీ పింక్ టెస్టు ప్రారంభం ముందు భారత క్రికెట్ విశ్లేషకుల అంచనాలు.. వీటన్నింటిని తిప్పికొడుతూ.. ప్రతిభ, పట్టుదల ఉంటే గులాబి బంతితో చరిత్ర సృష్టించగలమని నిరూపించింది టీమిండియా.
చారిత్రక డేనైట్ టెస్టులో విజయం టీమిండియానే వరించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఇషాంత్ శర్మ 9 (5/22, 4/56), ఉమేశ్ యాదవ్ 8 (3/29, 5/53) వికెట్లతో రాణించారు.
గంటలోపేముగిసినమ్యాచ్
మూడోరోజు ఆట ప్రారంభమైన గంటలోపే ముగించేశారు భారత బౌలర్లు. బంగ్లాను 195 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. ఓవర్ నైట్ స్కోరు 156/6 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు ఉమేశ్. ఇబదత్ హొస్సేన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.