దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇన్నింగ్స్ 202 పరుగుల భారీ తేడాతో గెలిచింది టీమిండియా. నాలుగో రోజు ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసి మ్యాచ్ ముగించడం విశేషం. ఈ సిరీస్‌లో మూడు శతకాలు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డూ దక్కింది.
132/8 ఓవర్‌నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు కోల్పోయింది. 47వ ఓవర్లో చివరి రెండు బంతులకు బ్రూన్(30), ఎంగిడి(5) పెవిలియన్ పంపించి మ్యాచ్ ముగించాడు నదీమ్. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. ఈ రోజు ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు సఫారీ బ్యాట్స్‌మెన్. డికాక్ (5), జుబైర్ హంజా (0), డుప్లెసిస్ (4), బవుమా (0), క్లాసన్ (5), లిండే (27), పీట్ (23) రబాడ (12) విఫలమయ్యారు. ఎల్గర్ 16 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. నదీమ్, ఉమేశ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.