కరోనా మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్ పర్యటనను రద్దు చేసుకునే ఆలోచనలో ఉంది భారత మహిళా క్రికెట్ జట్టు. జూన్‌లోనే ఇంగ్లీష్ గడ్డపై పర్యటనకు మహిళా టీమ్ఇండియా వెళ్లాల్సింది. కానీ, కరోనా కారణంగా ఆ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.
ద్వైపాక్షిక సిరీస్ కోసం యోచన!
సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, భారత్.. ట్రైసిరీస్ను నిర్వహించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే భారత జట్టు పర్యటనను రద్దు చేసుకుంటే.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఉమెన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించనున్నారు. తొలుత రెండు టీ20లు, నాలుగు వన్డేలు ఆడించాలని నిర్ణయించినా.. ఈ సీజన్లో సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్‌లను జరపడానికి ప్రణాళికను రచిస్తున్నారు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లను డెర్బీ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది.