మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్- న్యూజిలాండ్ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో... 3 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం చెందింది కివీస్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 రన్స్ మాత్రమే చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌వుమన్ షెఫాలీ వర్మ...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.
ఆఖరి ఓవర్ అదుర్స్...
134 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టుకు.. మంచి ఆరంభమే లభించింది. ప్రీస్ట్ (12), డివైన్ (14) ఫర్వాలేదనిపించారు. అయితే భారీస్కోర్లుగా మలచలేకపోయారు. సుజీ బేట్స్ (6) నిరాశపర్చింది. అయితే 34 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన జట్టును.. మ్యాడీ గ్రీన్ (24), మార్టిన్ (25) ఆదుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కివీస్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. అయితే ఆఖర్లో హేలే జెన్సన్ (11), అమేలియా కేర్ (34*) మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశారు. 19వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఆఖరి ఓవర్ వేసిన శిఖా... 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. ప్రపంచకప్ తొలి మ్యాచ్ ఆడిన రాధా యాదవ్... బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రెండు క్యాచ్‌లతో అద్భుత ప్రదర్శన చేసింది. భారత బౌలింగ్‌లో ఐదుగురు బౌలర్లూ తలో వికెట్ తీసుకున్నారు.
వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆరు అర్ధశతకాలు సాధించి చరిత్ర సృష్టించిన డివైన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం రాణించలేకపోయింది. ఆమె పరుగుల జోరుకు భారత బౌలర్ల బ్రేక్ వేశారు.