సిడ్నీ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బౌలింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. 133 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది.
హేలీ అర్ధశతకంతో
లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టును సూపర్ ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించింది అలీసా హేలీ. అయితే మరో ఎండ్‌లోని బ్యాట్స్ఉమెన్ మూనే (6), లానింగ్ (5), హైనెస్ (6) పేలవంగా ఆడటం వల్ల ఆమెకు మద్దతు కరవైంది. అయినా హేలీ 51 (35 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో రాణించి ఔటైంది. అయితే కొద్దిసేపు గార్డెనర్ 34 (36 బంతుల్లో; 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడింది. పెర్రీ (0), జోనస్సెన్ (2), అన్నాబెల్ (2) నిరాశపర్చారు.
తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత అమ్మాయిల బౌలింగ్ విభాగం కీలకంగా నిలిచింది. పూనమ్ యాదవ్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసింది. ఈ అమ్మడుకు తోడుగా శిఖా పాండే 3 వికెట్లు, రాజేశ్వరి ఒక వికెట్ ఖాతాలో వేసుకుంది. వీరికి తోడు భారత జట్టు కీపర్ తానియా భాటియా రెండు కీలక స్టంప్ ఔట్లు చేసింది.