దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఇటీవలే జరిగిన రెండో వన్డేలో ఘనవిజయం సాధించిన మిథాలీసేన.. మూడో వన్డేలోనూ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది. తొలి వన్డేలో పరాజయం తర్వాత వేగంగా పుంజుకున్న భారత మహిళా జట్టు.. రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని దెబ్బ తీసింది. దీంతో సిరీస్ సమం కాగా.. శుక్రవారం జరగనున్న మూడో మ్యాచ్‌లో గెలిచి, సిరీస్‌లో అధిక్యాన్ని సంపాందించేందుకు టీమ్ఇండియా వ్యూహాలు రచిస్తోంది.
అదే జట్టుతో..?
లఖ్‌నవూ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని.. మిథాలీసేన అవలీలగా ఛేదించింది. 28.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోయిన టీమ్ఇండియా ఆ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి 4 వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థిపై విరుచుకుపడింది. రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్ల తీయగా.. మన్సీ జోషీ రెండు వికెట్లు సాధించింది. టీమ్ఇండియా బౌలింగ్ లైనప్ సంతృప్తికరంగా ఉంది.
రెండో వన్డేలో టీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌వుమన్ జెమియా రోడ్రిగ్స్ ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత స్మృతి మంధాన నిలకడగా స్కోరు రాణిస్తూ.. పూనమ్ రౌత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించింది. మరోవైపు తొలివన్డేలో కెప్టెన్ మిథాలీరాజ్ హాఫ్‌సెంచరీతో సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మొదటి వన్డేలో ఫర్వాలేదనిపించింది. దీంతో బ్యాటింగ్‌లోనూ మార్పులేవి జరగకపోవచ్చు.
ఆధిక్యం కోసం..
టీమ్ఇండియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళా జట్టుకు చెందిన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ 4 కీలకమైన వికెట్లు పడగొట్టి.. తమ టీమ్ విజయానికి బాటలు వేసింది. అదే విధంగా రెండో వన్డేలోనూ ఏకైక వికెట్ సాధించిన బౌలర్‌గా నిలిచింది. షబ్నిమ్ ఇస్మాయిల్, నాన్కులులేకో మ్లాబా వంటి బౌలర్లతో సఫారీ బౌలింగ్ లైనప్ బలంగానే ఉంది.