బలంగా ఉన్న కోహ్లీసేనవెస్టిండీస్తో టీ20 సిరీస్లోఅలవోకగా మ్యాచ్‌లు గెలుస్తుందని భావించారు. మొదటి మ్యాచ్‌లో 200 పైగా స్కోరు చేశారు కరీబియన్లు.. అయితే విరాట్ విజృంభించడం వల్ల ఆ మ్యాచ్ గట్టెక్కాం. ఆ తర్వాత మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి భారత జట్టుకు షాకిచ్చారు. మరి టీమిండియా.. సిరీస్‌తో పాటు.. వరుస విజయాల పరంపరను కొనసాగించాలంటే నిర్ణయాత్మక మూడో టీ20లో నెగ్గాల్సిందే.ముంబయి వాంఖడే వేదికగా విండీస్‌తో ఆఖరి టీ20 ఆడనుంది టీమిండియా.
ట్రోఫీతో ఇరు జట్ల సారథులు కోహ్లీ, పోలార్డ్ టీమిండియా చేతిలో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన విండీస్.. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో గెలిచింది. ఇప్పుడు శాయశక్తులా పోరాడి సిరీస్ చేజిక్కుంచుకోవాలని పట్టుదలతో ఉంది.
టాస్ కీలకం
భారీ లక్ష్యాలను విజయవంతంగా ఛేదిస్తున్న కోహ్లీసేన.. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు చేతులెత్తేస్తోంది. తొలుత బ్యాటింగ్ చేస్తే ఆ మ్యాచ్‌ల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తెచ్చేసింది. గత మ్యాచ్‌లో ఆఖరి నాలుగు ఓవర్లలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు భారత క్రికెటర్లు. టాప్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్మన్లు ఉన్నా.. మ్యాచ్ ఫినిషర్లు భారత జట్టుకు కరువయ్యారు. మూడో టీ20లో ఈ సమస్యను అధిగమించకపోతే కష్టం. మంచు కురిసే వాంఖడేలో ఛేదన అత్యంత సులభం. విండీస్‌కు టాస్ వరించి ఫీల్డింగ్ ఎంచుకుంటే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరం.
క్యాచ్‌లు వదిలితే నష్టమే
టీమిండియా ఫీల్డింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫిట్‌నెస్ ప్రమాణాలు పెరిగిన కోహ్లీసేనలో 90ల నాటి ఫీల్డింగ్ కనిపించడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటి టీ20లో 4, రెండో టీ20లో 3 క్యాచ్‌లు నేలపాలయ్యాయి. స్వయంగా కెప్టెన్ విరాట్ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ ఇలాగే ఉంటే ఎన్ని పరుగులైనా సరిపోవని హెచ్చరించాడు.
బ్యాటింగ్-బౌలింగ్
గత మ్యాచ్‌లో అర్ధశతకం చేసిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే నుంచి జట్టు.. మరోసారి అలాంటి ప్రదర్శననే కోరుకుంటోంది. ఓపెనర్లు రోహిత్.. తన సొంత మైదానంలో విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం సాధించాలి.
వాషింగ్టన్ సుందర్ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. దీపక్ చాహర్, భువి త్వరగా లయ అందుకోవాలి. చాహర్ స్థానంలో షమి, సుందర్ బదులు కుల్దీప్ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు.
సంజూకు చోటు లేనట్లేనా!
2015లో జింబాబ్వేపై భారత్ తరఫునసంజు శాంసన్ ఓ టీ20 ఆడాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లకు తుది జట్టుకు ఎంపిక చేయలేదు. కీలకమైన వాంఖడే పోరులో అతడికి చోటు దక్కుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఒకవేళ జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలన్నది కోహ్లీకి మరో తలనొప్పి. విఫలమవుతున్నా పంత్‌కు మద్దతుగా ఉంటామన్నాడు. రాహుల్ ఇటీవలే అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరిలో ఎవరికీ విశ్రాంతినిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంజూ ఏ స్థానంలోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్నా... కీలక మ్యాచ్‌లో ఎవర్ని తప్పించే పరిస్థితి కనిపించడం లేదు. మరి సంజూ ఎదురుచూపులు ఎలా ఫలిస్తాయో చూడాలి.
ఎక్స్‌ట్రాలు తగ్గితే విండీస్ ధీమాగా
తిరువనంతపురంలో విజయంతో పొలార్డ్ సేనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. సిమన్స్, లూయిస్, హెట్మయిర్, పూరన్, బ్రాండన్ కింగ్, పొలార్డ్, హోల్డర్ ఫామ్‌లో ఉన్నారు. ఏ ఇద్దరు నిలిచినా పరుగుల వరద ఖాయమే. పైగా వాంఖడే పొలార్డ్‌కు కొట్టిన పిండి. అక్కడి పరిస్థితులు, పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అతడు చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు.
బౌలర్లు కాట్రెల్, పియరీ, విలియమ్స్, హేడెన్ వాల్ష్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. ఎక్స్‌ట్రాలు తప్ప బ్యాటింగ్ ద్వారా వచ్చే పరుగులను నియంత్రిస్తున్నారు.
వాంఖడేలో రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు. బ్యాట్స్‌మన్ అలవోకగా ఆడతారు.
రికార్డులు...
- పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ... సిక్సర్ దూరంలో మాత్రమే నిలిచాడు. హిట్‌మ్యాన్ మరో సిక్సర్ బాదితే టీ20ల్లో 400 సిక్సర్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
- మరో 6 పరుగులు సాధిస్తే స్వదేశంలో టీ20ల్లో 1000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు కోహ్లీ. ఇప్పటివరకు ఈ రికార్డు అందుకున్న వారిలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ (1430), కొలిన్ మన్రో (1000) మాత్రమే ఉన్నారు.
- టీమిండియా స్పిన్నర్ చాహల్.. అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. మరో వికెట్ సాధిస్తే పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. 36 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన చాహల్.. ప్రస్తుతం రవించంద్రన్ అశ్విన్‌తో సమంగా ఉన్నాడు.
- అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రారాజుగా కోహ్లీ(2563) మరోసారి నిలిచాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న హిట్‌మ్యాన్(2562).. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు. గత మ్యాచ్ తర్వాత వీరిద్దరి మధ్య 3 పరుగుల అంతరమే ఉంది.
15 మందితో జట్లు ఇవే...
భారత్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, షమి, సంజు శాంసన్.
వెస్టిండీస్:
కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఫాబియన్ అలెన్, బ్రాండన్ కింగ్, దినేశ్ రామ్‌దిన్, షెల్డన్ కాట్రెల్, లూయిస్, రూథర్‌ఫోర్డ్, హెట్మయిర్, పియరీ, సిమన్స్, హోల్డర్, హేడెన్ వాల్ష్, కీమో పాల్, విలియమ్స్.