వెస్టిండీస్‌పై పదో ద్వైపాక్షిక సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా నేడు నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కరీబియన్ జట్టుపై వరుసగా తొమ్మిది సిరీస్‌లు గెలుపొందింది భారత్. కటక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది.
టాపార్డర్ భారత్ బలం...
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు అదరగొట్టేశారు. రోహిత్ శర్మ(159), రాహుల్(102) జోడీ సెంచరీలతో చెలరేగింది. తర్వాత రిషభ్ పంత్(39), శ్రేయస్ అయ్యర్(53) ధాటిగా ఆడి సాగర తీరంలో సిక్సర్ల మోత మోగించారు. ఒక్క కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ మినహాయిస్తే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యద్భుతమనే చెప్పాలి.
బౌలింగ్‌తోనే సమస్య...
388 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్‌ను నిలువరించడంలో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఒకానొక సమయంలో వికెట్లు పడగొట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఒక్కసారి షమి వికెట్లు తీయడం ప్రారంభమయ్యాక కోలుకున్నారు పేసర్లు. కుల్‌దీప్ హ్యాట్రిక్‌తో మ్యాచ్ గమనం మారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 107 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా.. బౌలింగ్ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. ప్రధాన పేసర్ భువనేశ్వర్ గాయంతో తప్పుకోవడం వల్ల జట్టులోకి వచ్చిన శార్దుల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా తన స్పిన్ బౌలింగ్‌తో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. మూడో వన్డేకు ముందు పేసర్ దీపక్ చాహర్ వెన్నునొప్పి కారణంగా తప్పుకోగా, అతడి స్థానంలో నవ్‌దీప్ సైనీ వచ్చాడు.
విండీస్ టాప్ సూపర్...
భారత్‌కు తగ్గట్టుగానే విండీస్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. హెట్‌మెయర్, షై హోప్ తొలి వన్డేలో చెలరేగారు. ఇద్దరూ శతకాలతో రాణించడం వల్ల చెపాక్‌లో కరీబియన్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో హోప్(78) ఆకట్టుకున్నా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్ కరవయ్యారు. మధ్యలో నికోలస్ పూరన్(75) ధాటిగా ఆడినా తుదివరకు నిలవలేకపోయాడు. ఒకవేళ కీమో పాల్, పొలార్డ్, ఛేజ్ రాణించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.