కటక్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది వెస్టిండీస్. కచ్చితంగా నెగ్గాలన్న కసితో ఆడారు కరీబియన్లు. పూరన్, పొలార్డ్ అర్ధశతకాలతో రాణించారు. వీరి బ్యాటింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 రన్స్ సాధించింది విండీస్ జట్టు. ఆఖరి పది ఓవర్లలో 118 పరుగులు రావడం విశేషం.
ఆరంభం అదుర్స్...
విండీస్ ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షై హోప్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 14వ ఓవర్ ఆఖరి బంతికి జడేజా తొలి వికెట్‌గా లూయిస్(21(50 బంతుల్లో; 3 ఫోర్లు)ను పెవిలియన్ చేర్చాడు. అయితే వెంటనే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న హోప్‌ను బౌల్డ్ చేసి రెండో వికెట్ తీశాడు సైనీ. ఈ మ్యాచ్‌లో వన్డే కెరీర్లో 3వేల పరుగుల మైలురాయిని చేరాడీ ఆటగాడు. ఈ ఘనతను తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
మొదట హెట్మెయిర్... ఆఖర్లో పూరన్
వన్ డౌన్లో వచ్చిన ఛేజ్ 38(48 బంతుల్లో; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే హిట్టర్ హెట్మెయిర్ మాత్రం మరోసారి భారత బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 33 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కీలక సమయంలో మరోసారి బంతి అందుకున్న సైనీ.. హెట్మెయిర్, ఛేజ్‌లను ఔట్ చేశాడు.
ఆఖర్లో నికోలస్ పూరన్ 89(64 బంతుల్లో; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్‌ను 47వ ఓవర్ ఆఖరి బంతికి పెవిలియన్ చేర్చాడు శార్దుల్. మరో ఎండ్‌లో కీరన్ పొలార్డ్ 74( 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)బాది అజేయంగా నిలిచాడు. ఫలితంగా వీరిద్దరూ 5వ వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఫీల్డింగ్‌లో విఫలమైంది.
అరంగేట్రంలో ఫర్వాలేదనిపించాడు....
దీపక్ చాహర్ గాయం కారణంగా వైదొలగడం వల్ల మూడో వన్డేలో అరంగేట్రం చేశాడు నవదీప్ సైనీ. తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఈ 21 రెండేళ్ల ఫాస్ట్ బౌలర్.. మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. రెండు వికెట్లు తీయడమే కాకుండా ఒక క్యాచ్ పట్టాడు. 10 ఓవర్లు బౌలింగ్ వేసి 5.80 సగటుతో 58 పరుగులు ఇచ్చాడు.
మిగిలిన బౌలర్లలో జడేజా, షమి, శార్దుల్ తలో వికెట్ తీసుకున్నారు. కుల్దీప్ 100వ వికెట్ రికార్డును అందుకోలేకపోయాడు. 10 ఓవర్లు వేసి 67 రన్స్ ఇచ్చిన ఈ చైనామన్ బౌలర్.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.