భారత్, వెస్టిండీస్ జట్లు నేడు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కరీబియన్ జట్టు.. భారత గడ్డపై ట్రోఫీని గెలవాలని భావిస్తోంది. అయితే ఈ పర్యటనలో టీ20ల్లోనూ తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్ ఓడిపోయింది. అయితే కచ్చితంగా గెలవాల్సిన మూడో మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ విధ్వంసకర ప్రదర్శనకు విండీస్ జట్టు చేతులెత్తేసింది. గెలవాలి అన్న పరిస్థితుల్లో సరిగ్గా ఆడటం కోహ్లీసేన బలం. ఈ వన్డే సిరీస్‌లోనూ అదే టాపార్డర్ సత్తాచాటే అవకాశం ఉంది. అయితే గెలిస్తే కప్పు, ఓడితే మరో అవకాశం అన్న ధీమాతో ఉంది వెస్టిండీస్. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.
ట్రోఫీతో కోహ్లీ, పోలార్డ్ టాపార్డర్ ఫుల్ ఫామ్..
భారత జట్టు బ్యాటింగ్ లైనప్ పుల్ ఫామ్‌లో ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీలతో కూడిన టాపార్డర్ మంచి ప్రదర్శన చేస్తోంది. అయితే తొలి వన్డేలో పేలవ షాట్లతో వీళ్లు ఔటవడం వల్లే టీమిండియా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే మాత్రం ఈ మ్యాచ్ గెలవాలి కాబట్టి మళ్లీ హిట్‌మ్యాన్, విరాట్ నుంచి భారీ స్కోరు ఆశించవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు హిట్‌మ్యాన్ నెమ్మదిగా ఆడి.. కుదురుకున్నాక షాట్లు కొట్టడంలో అనుభవజ్ఞుడు.
వీళ్లకు తోడు తొలి వన్డేలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన పంత్, శ్రేయస్ ఫామ్‌లోకి వచ్చారు. వీళ్లు కూడా ఈ మ్యాచ్‌లో రాణిస్తే.. భారత్ భారీ స్కోరు చేయడం కష్టమేమి కాదు. పిచ్ పరిస్థితుల వల్ల కేదార్ జాదవ్, జడేజా అనుకున్న దానికంటే తక్కువ పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో వాళ్లు వేగం పెంచాల్సి ఉంది.
బౌలింగ్‌లో చాహల్‌కు ఛాన్స్...
గత మ్యాచ్‌లో భారత్ బౌలింగ్‌లో కాస్త లోటు కనిపించింది. కరీబియన్ బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేయడానికి మన బౌలర్లు శ్రమించినా ఫలితం లభించలేదు. విశాఖలో పిచ్‌పై చాహల్‌కు మంచి అనుభవం ఉంది. కుల్దీప్తో పాటు ఈ స్పిన్నర్ కూడా మ్యాచ్‌లోకి వచ్చే అవకాశముంది. అయితే భువనేశ్వర్ స్థానంలో వచ్చిన శార్దుల్ ఠాకుర్.. చాహల్‌కు పోటీలో నిలుస్తున్నాడు. ఆల్‌రౌండర్ దూబేను ఈ మ్యాచ్‌కు తప్పించే అవకాశం ఉంది. ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
చెపాక్ మైదానం అసలే బౌలింగ్ పిచ్, దానికి తోడు భారీ లక్ష్యం అయినా వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఆత్మవిశ్వాసం కాస్తయినా తగ్గలేదు. టీ20ల్లో రాణించినా వన్డేల్లో తేలిపోతారన్న అపవాదును తొలిగించుకున్నారు కరీబియన్లు. శైలికి తగ్గట్లు ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడకుండా నెమ్మదిగా ఆడుతూ వీలుచిక్కినప్పుడు బౌండరీలు బాదారు. ఓపెనర్లు భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ప్రయత్నించారు. షై హోప్ జాగ్రత్తగా ఆడితే... వన్ డౌన్లో వచ్చిన హెట్మెయిర్ ఫుల్ ఫామ్‌లో దంచికొట్టాడు. వీరిద్దరూ ఇలాంటి ప్రదర్శన చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు.
మూడో టీ20లో గాయపడిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ నేటి మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఇతడు మ్యాచ్‌లోకి వస్తే మరింత బలం చేకూరే పరిస్థితి ఉంది. ఇతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. నికోలస్ పూరన్, సారథి పొలార్డ్ కీలకం. ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, జేసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్ అద్భుమైన ప్రదర్శన చేశారు. వీరు గత మ్యాచ్ జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.
జట్ల అంచనా...
రోహిత్‌శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), కేదార్ జాదవ్/మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకుర్/చాహల్
షై హోప్(కీపర్),సునిల్ అంబ్రిస్, షిమ్రన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, హేడెన్ వాల్ష్, అల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్.