విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో కోహ్లీ నిరాశపర్చారు. తొలి మ్యాచ్‌లో 4 పరుగులకే ఔటైన విరాట్.. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రాహుల్(102) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత, వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. పొలార్డ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని షార్ట్ బాల్ వేయగా... ఎదుర్కొన్న తొలి బంతినే షాట్ కొట్టబోయి మిడ్ వికెట్‌లో క్యాచ్ లేపాడు కోహ్లీ. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఛేజ్ పట్టుకున్నాడు. ఫలితంగా టీమిండియా సారథి ఇన్నింగ్స్.. ఖాతా తెరవకుండానే ముగిసింది.
ఈ మ్యాచ్ కోహ్లీకి 400వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఘనత సాధించిన 8వ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. సచిన్(664) తొలిస్థానంలో ఉండగా.. ధోనీ(538), ద్రవిడ్(509), అజహర్(433), గంగూలీ(424), కుంబ్లే(403), యువరాజ్(402), కోహ్లీ(400*) ఈ జాబితాలో ఉన్నారు.
విశాఖలో తొలిసారి....
విశాఖపట్నంలో ఇప్పటివరకు 139 సగటుతో పరుగులు చేసిన కోహ్లీ... ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. గతంలో 118, 117, 99, 65, 157* సాధించగా.. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.
2010 నుంచి ఇప్పటివరకు అత్యధిక డకౌట్లు అయిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ హాఫీజ్(27), కోహ్లీ(25), మొయిన్ అలీ(25), తమీమ్ ఇక్బాల్/గప్తిల్(24)ఈ లిస్టులో ఉన్నారు.
>> ఈ ఏడాది అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ. 45 ఇన్నింగ్స్‌ల్లో 2370 పరుగులు చేశాడు. తొలిస్థానంలో రోహిత్(2379--46 ఇన్నింగ్స్) ఉన్నాడు.
>>ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు చేసిన వారిలో రోహిత్ టాప్‌లో కొనసాగుతున్నాడు. 1427 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు రోహిత్. తర్వాత స్థానాల్లో కోహ్లీ(1292), విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్(1225) ఉన్నారు.
విండీస్ కెప్టెన్ ఇదే దారిలో...
రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తరహాలోనే గోల్డెన్ డకౌట్ అయ్యాడు వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్. ఎదుర్కొన్న తొలిబంతికే పెవిలియన్ చేరాడీ కరీబియన్ స్టార్. టీమిండియా పేసర్ షమి వేసిన 29వ ఓవర్ మూడో బంతిని అడ్డుకోబోయాడు. బ్యాట్‌కు తాకుతూ వెనక్కి వెళ్లగా కీపర్ పంత్ ఒడిసిపట్టేశాడు. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు గోల్డెన్ డకౌట్ కావడం విశేషం.