తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ 'శత'క్కొట్టుడు... రికార్డులు బ్రేక్​ - rohit century

అమ్మమ్మ ఊరిలో రోహిత్​శర్మ మరోసారి విధ్వంసకర ప్రదర్శన చేశాడు. విశాఖ వేదికగా విండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో మరో శతకం సాధించాడు. ఫలితంగా పలు రికార్డులు బ్రేక్​ అయ్యాయి. ఈ మ్యాచ్​లో 159 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు హిట్​మ్యాన్​.

India vs West Indies 2019
రోహిత్​ 'శత'క్కొట్టుడు... రికార్డులు బ్రేక్​

By

Published : Dec 18, 2019, 8:18 PM IST

ఏడేళ్ల నుంచి వన్డేల్లో రారాజుగా రాణిస్తోన్న రోహిత్​శర్మ... మరోసారి తన ప్రతాపం చూపించాడు. విండీస్​ బౌలింగ్​ను చీల్చి చెండాడుతూ... కెరీర్​లో మరోసారి 150 పైగా స్కోరు సాధించాడు. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో మొదట నెమ్మదిగా ఆడిన హిట్​మ్యాన్​... ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి 100 పరుగులు చేయడానికి 107 బంతులు తీసుకున్న రోహిత్​.. తర్వాత 59 పరుగులను 21 బంతుల్లో కొట్టాడు. ఈ మ్యాచ్​లో పలు రికార్డులను అధిగమించాడు హిట్​మ్యాన్​.

రోహిత్​ @ 28...

ఈ మ్యాచ్​లో సెంచరీ సాధించిన రోహిత్​... కెరీర్​లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీటితో పాటు ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు(1427)తో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు. తర్వాతి స్థానంలో కోహ్లీ (1292), విండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​(1225*) రెండు మూడు ర్యాంకుల్లో ఉన్నాడు.

>> వన్డేల్లో ఒక ఏడాది కాలంలో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్​ నాలుగో స్థానంలో నిలిచాడు.

రోహిత్​ సెంచరీ

>> 9 శతకాలు-సచిన్​ తెందూల్కర్​ (1998), 7 శతకాలు- సౌరభ్​ గంగూలీ (2000), 7 శతకాలు- డేవిడ్​ వార్నర్​ (2016) తర్వాత 7*శతకాలు- రోహిత్​ శర్మ (2019) ఈ లిస్టులో ఉన్నాడు.

>> ఒక క్యాలెండర్​ సంవత్సరంలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు హిట్​మ్యాన్​. ఇప్పటివరకు 75 సిక్సర్లు బాదాడు. 2018లో 74 సిక్సర్లు, 2017లో 65 సిక్సర్లతో హ్యాట్రిక్​ రికార్డు కొట్టాడు.

>> అన్ని పార్మాట్లలో కలిపి రోహిత్​ ఈ ఏడాది 10 శతకాలు చేశాడు. ఒక ఓపెనర్​ ఇన్ని సెంచరీలు చేయడం రికార్డు. గతంలో సచిన్​(9), గ్రేమ్​ స్మిత్​(9), వార్నర్​(9) ఈ ఘతన సాధించారు.

>>ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువసార్లు వంద స్కోరు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్​(10) టాప్​లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో కోహ్లీ(7), వార్నర్​(6) ఉన్నారు.

>> అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో... ఈ ఏడాదీ రోహిత్​ పేరిటే రికార్డు నమోదైంది. 2013 - ​(209), 2014 -​(264)​, 2015 - (150), 2016 - (171*), 2017 - (208*), 2018 - (162), 2019 - (159) రన్స్​ చేశాడు.

>> రోహిత్​ గత రెండేళ్లుగా టీమిండియాలో కీలక ప్రదర్శన చేస్తున్నాడు. 2007 నుంచి 16 వరకు 147 ఇన్నింగ్స్​ ఆడిన హిట్​మ్యాన్​... 10 శతకాలు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నుంచి స్పీడు పెంచాడు. 2017 నుంచి ఇప్పటివరకు 66 ఇన్నింగ్స్​ ఆడగా... 18 శతకాలు సాధించడం విశేషం.

>> వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన నాలుగో బ్యాట్స్​మన్​గా రోహిత్​ ఘతన సాధించాడు. సచిన్​(49), కోహ్లీ(43), పాంటింగ్​(30), రోహిత్​(28), జయసూర్య(28) లిస్టులో ముందున్నారు.

>> 2017 నుంచి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు రోహిత్​. 2019 నాటికి 18 శతకాలు చేశాడు. విరాట్​(17), బెయిర్​స్టో(9). ధావన్​/బాబర్​/ఫించ్​/రూట్​ (8) సెంచరీలుతో ఉన్నారు.

200 భాగస్వామ్యం....

వెస్టిండీస్​పై ఇప్పటివరకు మూడుసార్లు 200 పైగా భాగస్వామ్యం నెలకొల్పారు టీమిండియా బ్యాట్స్​మెన్లు. ఇందులో మూడు సార్లు రోహిత్ చోటు దక్కించుకున్నాడు.

విండీస్​పై సిక్సర్లు...

సిక్సర్లు అంటే గుర్తొచ్చేది కరీబియన్లు. కానీ వారిపైనే అత్యధిక సిక్సర్లు నమోదు చేశాడు హిట్​మ్యాన్​. ఇప్పటివరకు విండీస్​పై 29 సిక్స్​లు కొట్టాడు. ధోనీ(28), కోహ్లీ(25) తర్వాతి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది 77 సిక్సర్లు, 236 ఫోర్లు బాదాడు. ఇవే ఈ ఏడాదికి రికార్డు.

అన్ని జట్లపై...

2019లో ఐసీసీ టాప్‌-9 వన్డే ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లలో న్యూజిలాండ్‌ను మినహాయించి మిగతా అన్ని జట్లుపై రోహిత్‌ శతకాలు నమోదు చేశాడు. ఈ ఏడాది వెస్టిండీస్‌పైనే రోహిత్‌ మూడు వన్డే శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 150కిపైగా స్కోరు సాధించిన జాబితాలో రోహిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిదోసార్లు ఈ భారీ స్కోరు చేశాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(6) రెండో స్థానంలో ఉండగా, సచిన్‌ టెండూల్కర్‌/క్రిస్‌గేల్‌(5సార్లు) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

>> సాగర తీరంలో...

విశాఖలో ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ 3 శతకాలు సాధించాడు రోహిత్​. ఈ మ్యాచ్​కు ముందు దక్షిణాఫ్రికాతో రెండు ఇన్నింగ్స్​ జరగ్గా... 176, 127 రన్స్​ చేశాడు. తాజాగా మ్యాచ్​లోనూ 159 పరుగులతో రాణించాడు.

ABOUT THE AUTHOR

...view details