తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ను ఓడించి రేసులో నిలిచిన టీమిండియా

విండీస్​తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో 107 పరుగుల తేడాతో జయపతాకం ఎగురవేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్​ 1-1తో సమమైంది. తర్వాత మ్యాచ్ ఈనెల​ 22న​ కటక్​లో జరగనుంది.

By

Published : Dec 18, 2019, 9:23 PM IST

Updated : Dec 18, 2019, 9:59 PM IST

india vs west indies 2019
విండీస్​ను ఓడించి రేసులో నిలిచిన టీమిండియా

భారత్​-వెస్టిండీస్​ మధ్య మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఎట్టకేలకు 1-1తో సమమైంది. విశాఖపట్నంలో బుధవారం జరిగిన రెండో వన్డే ప్రేక్షకులకు ఫుల్​ మజా ఇచ్చింది. టీమిండియా తొలుత బ్యాటింగ్​లో ఆకట్టుకోగా... లక్ష్య ఛేదనలో విండీస్​ పోరాడింది. తుది ఫలితంలో మాత్రం కోహ్లీసేన ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణయాత్మక మూడో వన్డే కటక్​లో ఆదివారం జరగనుంది.

భారత్​ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్య ఛేదనలో, ఓవర్లన్నీ ఆడి 280 పరుగులకే ఆలౌటయ్యారు కరీబియన్లు. ఫలితంగా 107 పరుగుల తేడాతో నెగ్గిందికోహ్లీసేన. విండీస్​​ బ్యాట్స్​మెన్​లో హోప్​, పూరన్​ అర్ధశతకాలతో రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్​, షమి చెరో 3 వికెట్లు తీశారు. జడేజా 2, శార్దుల్​ ఓ వికెట్​ సాధించాడు.

ఓపెనింగ్​ సూపర్​..

టీమిండియా ఇచ్చిన భారీ లక్ష్య ఛేదనలో మంచి ఆరంభమే అందుకుంది విండీస్​. లూయిస్​(30) తొలి వికెట్​గా ఔటయ్యాక, హెట్మయిర్​(4), ఛేజ్​(4) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మరో ఓపెనర్​ హోప్​ 78(7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి​ పూరన్ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. 75 పరుగులు​(47 బంతుల్లో; 6 ఫోర్లు, 6 సిక్సర్లు)చేశాడుపూరన్​. క్రీజులో ఉన్నంత వరకూ వీరిద్దరూ.. టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు.

షమి టర్నింగ్​...

86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్​.. తర్వాత వికెట్​ 192 వద్ద కోల్పోయింది. ఈ మధ్యలో నికోలస్​ పూరన్​ భారత బౌలింగ్​ను చితక్కొట్టాడు. కీలక సమయంలో షమి బ్రేక్​ ఇచ్చాడు. వరుస బంతుల్లో పూరన్​, కరీబియన్​ సారథి పొలార్డ్​ను ఔట్​ చేశాడు. విరాట్​ తరహాలోనే గోల్డెన్​ డకౌట్​ అయ్యాడు పొలార్డ్​. ఇలా ఒకే తరహాలో ఇరుజట్ల సారథులు ఔటవ్వడం ప్రపంచ క్రికెట్​లో తొలిసారి.

ఆ తర్వాత వచ్చిన హోల్డర్​(11), అల్జారీ జోసెఫ్​(0) తక్కువ స్కోరు చేసి ఔటయ్యారు. ఆఖర్లో కీమో పాల్​ 46(42 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పియర్రీ 21(18 బంతుల్లో; 3 ఫోర్లు).. తమ బ్యాటింగ్​తో ఆశలు కల్పించినా, మ్యాచ్​ను​ గెలిపించలేకపోయారు.

కుల్దీప్​ రెండోసారి హ్యాట్రిక్

టీమిండియా బౌలర్​ కుల్దీప్..​ ఈ మ్యాచ్​లో మరోసారి హ్యాట్రిక్​ నమోదు చేశాడు. వరుస బంతుల్లో హోప్​, హోల్డర్​, జోసెఫ్​ వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. గతంలోనూ వన్డేల్లో ఈ ఫీట్​ సాధించాడు. ఇప్పటివరకు భారత్​ బౌలర్లలో చేతన్​ శర్మ, కపిల్​దేవ్​, మహ్మద్​ షమి ఒక్కోసారి ఈ రికార్డు సృష్టించారు. కానీ కుల్దీప్​ మాత్రమే రెండుసార్లు సాధించాడు.

రోహిత్​-రాహుల్​ ధనాధన్​...

మొదట బ్యాటింగ్​ చేసిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్​ శర్మ, రాహుల్​ భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించారు. రోహిత్‌ 159(138 బంతుల్లో 17ఫోర్లు, 5సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ 102(104 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సెంచరీ చేసిన తర్వతా ఆల్జరీ జోసెఫ్‌ బౌలింగ్‌లోక్యాచ్‌ ఔటయ్యాడు రాహుల్​.

కోహ్లీ గోల్డెన్​ డక్​...

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వచ్చీ రాగానే పొలార్డ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి డకౌట్​ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 232 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ 53(32 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు)తో జోడీ కట్టిన రోహిత్‌.. మూడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 150 దాటిన తర్వాత ధాటిగా ఆడిన హిట్‌మ్యాన్‌... కాట్రెల్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్​ పంత్‌ 39 (16 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) మరోసారి చక్కటి ఇన్నింగ్స్​ నెలకొల్పారు. ఫలితంగా నాలుగో వికెట్‌కు కీలకమైన 73 పరుగులు సాధించారు. చివర్లో ఇద్దరూ ఔటైనా కేదార్‌ జాదవ్‌ 16( 10 బంతుల్లో 3ఫోర్లు) బౌండరీలతో చెలరేగడం వల్ల టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు సాధించింది కోహ్లీసేన.

ఈ స్కోరు వన్డే ఫార్మాట్‌లో విండీస్‌పై రెండో అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో కరీబియన్​ జట్టుపై 418 పరుగులు సాధించింది భారత్. విండీస్​ బౌలర్లలో కాట్రెల్​ 2 వికెట్లు తీయగా... కీమో పాల్​, జోసెఫ్​, పోలార్డ్​ తలో వికెట్​ సాధించారు.

Last Updated : Dec 18, 2019, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details