తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హిట్​'మెయిర్​ జోరు.. టీమిండియా బేజారు - india vs west indies

చెన్నై వేదికగా భారత్​తో జరిగిన తొలి వన్డేలో విండీస్​ విజయం సాధించింది. బౌలర్లకు అనుకూలించే పిచ్​పై కరీబియన్​ బ్యాట్స్​మన్లు హోప్​, హెట్​మెయిర్​ శతకాలతో రాణించారు. వీరిద్దరి బ్యాటింగ్​ ధాటికి 288 పరుగుల లక్ష్యం అలవోకగా కరిగిపోయింది. ఫలితంగా వెస్టిండీస్​ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

India vs West Indies, 1st ODI
'హిట్​'మెయిర్​ సిక్సర్ల వర్షం.. 8 వికెట్ల తేడాతో విండీస్​ విజయం

By

Published : Dec 15, 2019, 10:04 PM IST

Updated : Dec 15, 2019, 10:20 PM IST

చెన్నైలోని చెపాక్​ మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. బౌలింగ్​కు స్వర్గధామమైన పిచ్​పై విండీస్​ బ్యాట్స్​మన్​ చెలరేగిపోయారు. ముఖ్యంగా హెట్​మెయిర్ సెంచరీ చేసి​ ఒంటిచేత్తో వెస్టిండీస్​ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. మరో ఎండ్​లో షై హోప్​ శతకంతో రాణించాడు. వీరిద్దరి బ్యాటింగ్​ దెబ్బకు భారత బౌలింగ్​ లైనప్​ కుదేలైంది. ఫలితంగా కరీబియన్​ జట్టు 47.5 ఓవర్లలో 288 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 వికెట్లు ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పొలార్డ్​ సేన.

ఆరంభం దక్కలేదు...

288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్​ జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. 11 పరుగుల వద్ద సునిల్​ అంబ్రిస్​ను ఎల్బీ రూపంలో పెవిలియన్​ చేర్చాడు దీపక్​ చాహర్​. ఆ తర్వాత హెట్​మెయిర్​​, మరో ఓపెనర్​ షై హోప్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు.

హద్దులు లేని బ్యాటింగ్​...

తొలుత నెమ్మదిగా సింగిల్స్​ ఆడిన హెట్​మెయిర్​.. కెరీర్​లో ఐదో శతకం ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాపై రెండోది. కుల్దీప్​ వేసిన 32.3 ఓవర్​లో సింగిల్​ తీసి 85 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడీ కరీబియన్​ బ్యాట్స్​మన్​. ఇతడి ధాటికి భారత బౌలర్లు నిస్సహాయులయ్యారు. ఇలాంటి సమయంలో షమి వేసిన 38.4 ఓవర్​లో భారీ షాట్​ ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. హెట్​మెయిర్​139(106 బంతుల్లో; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఫలితంగా హోప్​తో కలిసి ఇతడు నెలకొల్పిన 218 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

మరో ఓపెనర్​ షై హోప్​ 102 పరుగులు (151 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్సర్​) చేసి సహకారం అందించాడు. ఆఖర్లో​ పూరన్​ 28 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన హెట్​మెయిర్​కు 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' లభించింది.

అయ్యర్​-పంత్​ ఇన్నింగ్స్​...

టీమిండియాకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), కేఎల్ రాహుల్(6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విండీస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ వీరిద్దరిని ఔట్ చేసి భారత్​కు షాకిచ్చాడు. మరో ఓపెనర్ రోహిత్​ కూడా 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో ఎప్పటినుంచో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియాకు.. సరైన బ్యాట్స్​మన్​గా శ్రేయస్​ అయ్యర్​ నిలిచాడు. ఈ మ్యాచ్​లో 70 పరుగులు(88 బంతుల్లో; 7ఫోర్లు, 1 సిక్సర్​) సాధించి భారత జట్టును గాడిన పెట్టాడు. 80 పరుగులకే మూడు వికెట్లు పడిన టీమిండియా ఇన్నింగ్స్​ను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.

ధోనీ ఫేవరెట్​ మైదానంలోనే...

టీమిండియా మాజీ సారథి, కీపర్​ ధోనీ.. ఫేవరెట్​ మైదానంలో పంత్​ సత్తా చాటాడు. చాలా రోజులుగా సరైన ఫామ్​ లేమితో విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ క్రికెటర్​... ఎట్టకేలకు కెరీర్​లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు. 71 పరుగులు(69 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు పంత్​. టాపార్డర్​ బ్యాట్స్​మెన్లకే సాధ్యంకాని రీతిలో 102.9 స్టయిక్​ రేటుతో పరుగులు సాధించాడు.

చక్కటి ఇన్నింగ్స్​తో జట్టును ఆదుకున్న పంత్​.. అచ్చిరాని షాట్​తోనే ఔటయ్యాడు. ఎక్కువగా డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్‌ లెగ్‌, డీప్‌ పాయింట్‌ల్లో ఔటయ్యే పంత్‌ మళ్లీ అదే తప్పు చేశాడు. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్ లెగ్‌లోకి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసి వికెట్‌ కోల్పోయాడు. పొలార్డ్‌ వేసిన 40 ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా ఫోర్‌కు పంపిన పంత్‌.. ఆ ఓవర్‌ మరుసటి బంతిని స్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన జాదవ్​(40), జడేజా(21), దూబే(9), చాహర్​(6) పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్​ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 రన్స్​ చేయగలిగింది.

రికార్డులు...

>> భారత్​పై అత్యధిక స్కోరు చేసిన ఐదో విండీస్ బ్యాట్స్​మన్​గా నిలిచాడు హెట్​మెయిర్​. హైనెస్​(152*), చంద్రపాల్​(149*), రిచర్డ్​(149), గేల్​(140) ఇతడి కంటే ముందున్నారు.

>> తక్కువ ఇన్నింగ్స్​ల్లో 5 శతకాలు చేసిన విండీస్​ బ్యాట్స్​మన్​గా హెట్​మెయిర్​ ఘనత సాధించాడు. 38 ఇన్నింగ్స్​ల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. హోప్​(46 ఇన్నింగ్స్​), గ్రీన్ ​డిగే(52), రిచర్డ్స్​(54), గేల్​(66), హైనెస్​(69), లారా(83) ఇతడి తర్వాత ఉన్నారు.
>> గతంలో భారత్​పై విండీస్​ ద్వయం రిచర్డ్స్​-గార్డన్​ కలిసి 218 భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా హోప్​-హిట్​మెయిర్​ ఆ రికార్డును సమం చేశారు.
>> ఈ మైదానంలో రెండో అత్యుత్తమ ఛేదన(288) సాధించింది విండీస్ జట్టు. గతంలో ఇదే వేదికపై న్యూజిలాండ్​ ఇచ్చిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్​ జట్టు.
>>ఈ మ్యాచ్​లో 3 క్యాచ్​లు అందుకున్నాడు విండీస్​ సారథి కీరన్​ పొలార్డ్​. ఇది అతడి వన్డే కెరీర్​లో మూడోసారి.

Last Updated : Dec 15, 2019, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details