నూతన సంవత్సరంలో భారత్‌తో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమౌతోంది శ్రీలంక. ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం 16 మందితో జట్టుని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ సారథి. దాదాపు 16 నెలల తర్వాత టీ20 జట్టులోకి ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ వస్తున్నాడు. అయితే ఇప్పటికే భారత్ కూడా తన జట్టుని ప్రకటించింది. ఇందులో స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ చోటు సంపాదించుకున్నారు.
గత ఏడాది చివర్లో వెస్టిండీస్‌పై 2-1 తేడాతో భారత్ టీ20 సిరీస్ గెలవగా... పాకిస్థాన్ గడ్డపై శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఫలితంగా ఇరుజట్లు అదే జోరుని ప్రదర్శించాలని ఊవిళ్లూరుతున్నాయి.
మాథ్యూస్ వచ్చేశాడు...
భారత్ పిచ్‌లపై శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగకు మంచి అవగాహన ఉండగా.. మెండిస్, ఇసురు ఉడానా వంటి సీనియర్లతో లంక జట్టు పటిష్ఠంగా ఉంది. వీరికి తోడు ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యాస్ కూడా రావడం వల్ల జట్టుకు మరితం బలం చేకూరింది.
- శ్రీలంక జట్టు:
లసిత్ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసున్ శనక, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, లక్షణ్ సందకన్, కసున్ రజిత.