మొహాలీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. విరాట్ అర్ధశతకంతో రాణించగా.. ధావన్ మంచి ప్రదర్శన చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు దక్కింది.
ధావన్ శుభారంభం...
క్రీజులో నిలదొక్కుకొనేందుకుఆరంభం నుంచే నెమ్మదిగా ఆడిన రోహిత్.. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే జోష్‌ను ప్రదర్శించే క్రమంలో ఫెలుక్వాయో బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ 12 పరుగుల(12 బంతుల్లో)వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం వల్ల 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 40 పరుగులు (31 బంతుల్లో; 4ఫోర్లు, 1 సిక్సర్)చేశాడు. చాలా రోజుల తర్వాత ధావన్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం చేసే ఊపులో మిల్లర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ధావన్.
సారథి సత్తా...
ప్రపంచకప్, వెస్టిండీస్ పర్యటనలో తిరుగులేని ఫామ్ కనబరిచిన విరాట్ కోహ్లీ.. మరోసారి తన జోరు చూపించాడు. 72 పరుగులు (52 బంతుల్లో; 4 ఫోర్లు, 3సిక్సర్లు)చేసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్(4) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు(14 బంతుల్లో; 2ఫోర్లు)రాణించాడు. ఫలితంగా సిరీస్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా.