తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధర్మశాలలో నేడు భారత్​-దక్షిణాఫ్రికా 'తొలిపోరు' - Quinton de Kock news

టీమిండియా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్​ ఆరంభించనుంది. తొలిమ్యాచ్​ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ పోరుకు ఓవైపు వర్షం ముప్పు పొంచి ఉంది. మరోవైపు కరోనా ప్రభావం కారణంగా స్టేడియం చాలా వరకు ఖాళీగానే దర్శనమివ్వనుంది.

India vs South Africa
ధర్మశాలలో నేడే భారత్×దక్షిణాఫ్రికా తొలి వన్డే

By

Published : Mar 12, 2020, 5:54 AM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో నిరాశ పరిచిన కోహ్లీసేన మరో సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. భారత్‌లో సఫారీసేన అంత ప్రమాదకరమేమి కాదు. ఎప్పుడూ భారత్‌దే పైచేయి. ఫలితంగా టీమిండియా బలంగా పుంజుకోవడానికి ఈ సిరీస్‌ చక్కని వేదిక. అయితే దక్షిణాఫ్రికా మునుపటి కంటే బలంగా మారింది. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోరు మీదుంది. తేలికగా తీసుకుంటే భారత్‌కు షాకిచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఇలాంటి సమయంలో ధర్మశాల వేదికగా నేడు జరగనున్న తొలి వన్డే ఆసక్తికరంగా మారింది. మరి దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించి సిరీస్‌లో భారత్‌ బోణి కొడుతుందా? సఫారీసేనపై జైత్రయాత్ర కొనసాగిస్తుందా?

కోహ్లీ- డికాక్​

ఆ ముగ్గురిపైనే...

దక్షిణాఫ్రికా సిరీస్‌లో అందిరి చూపు హార్దిక్ పాండ్య‌, భువనేశ్వర్‌, శిఖర్‌ ధావన్‌పైనే ఉంది. గాయాలతో జట్టుకు దూరమైన ముగ్గురు ఆటగాళ్లు ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నారు. ఈ ముగ్గురు కలిసి ప్రపంచకప్‌లో ఆసీస్‌తో ఆడిన మ్యాచే ఆఖరిది. వీళ్లంతా ఈ సిరీస్​లో ఏ మేరకు సత్తాచాటుతారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఫిటెనెస్‌ సాధించిన పాండ్య డీవై పాటిల్‌ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్‌లతో తన ఫామ్‌కు ఢోకా లేదని సంకేతాలు పంపించినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. జట్టు బలోపేతం కావాలంటే అతడు మునపటిలా రాణించాలి. హార్దిక్‌తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ సత్తా చాటాల్సి ఉంది. కెప్టెన్‌ కోహ్లీకి కూడా ఈ సిరీస్‌ ఎంతో కీలకం. న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైన అతడు.. ఫామ్‌ నిరూపించుకోడానికి ఈ మ్యాచ్​లు దోహదపడతాయి.

హార్దిక్​, భువనేశ్వర్​, ధావన్​

ఓపెనర్​ ఎవరు..?

అనుభవం ఉన్న ఓపెనర్ జట్టులో లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో న్యూజిలాండ్‌ పర్యటనలో తెలిసింది. రోహిత్, ధావన్‌ దూరమవ్వడం వల్ల వచ్చిన అవకాశాన్ని యువ ఓపెనర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ధావన్‌ జట్టులోకి రావడం వల్ల అతడితో పాటు ఓపెనర్ ఎవరనేది తేలాల్సి ఉంది. కివీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా పృథ్వీకే తొలి వన్డేలో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ తుది జట్టులో చోటు కోసం వేచి చూడక తప్పదన్నట్లు కనిపిస్తోంది. కేదార్‌ జాదవ్‌ జట్టులో లేకపోవడం వల్ల ఆరో స్థానంలో మనీష్‌ పాండేకు పోటీ లేదు. అయితే ధర్మశాల వేదిక పేసర్లకు ఎక్కవుగా అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్‌ కోసం జడేజా ఒక్కడినే తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే జడేజాతో పాటు కుల్దీప్​కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.

బ్యాటింగ్‌ ఫుల్​.. బౌలింగ్‌ నిల్​

గతేడాది భారత పర్యటనకు వచ్చిన సఫారీసేన టీ20 సిరీస్‌, టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేసిన డికాక్‌ సేన.. ఫుల్​ జోరు మీదుంది. యువ ఓపెనర్‌ మలాన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వెర్రిన్నే, డేవిడ్‌ మిల్లర్, డికాక్‌ ఫామ్‌లో ఉన్నారు. ఆసీస్‌పై విజయంలో వీళ్లు కీలక పాత్ర పోషించారు. కానీ, జట్టులో బౌలర్లు రబాడ, షంసి లేకపోవడం దక్షిణాఫ్రికా ప్రతికూలాంశమే.

బలమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఎదుర్కోవాలంటే అనుభవం ఉన్న బౌలర్లు సఫారీ సేనకు ఎంతైనా అవసరం. అయితే ఎంగిడి, మహారాజ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. నోర్జె గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేస్తున్నాడు. అతడితో పాటు ఫెలుక్వాయో వైవిధ్య బంతులతో రాణిస్తున్నాడు. మరి భారత బ్యాట్స్‌మెన్‌ను వీళ్లంతా ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం. జట్టులోకి అనుభవజ్ఞుడైన డుప్లెసిస్‌ రావడం దక్షిణాఫ్రికా జట్టుకు సానుకూలాంశం.

డుప్లెసిస్‌

పిచ్ పరిస్థితి?

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లకు సహకరిస్తుంది. ఈ వేదికలో 4 వన్డేలు జరగ్గా.. ఒక్క మ్యాచ్‌లోనే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఛేదనకు దిగిన జట్టే గెలిచింది. ఈ వేదికగా 2014లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో చెలరేగాడు.

తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు: 214

రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు: 201

ఆసక్తికర విశేషాలు..

  • ఇప్పటివరకు బుమ్రా,భువనేశ్వర్​ కలిసి బరిలోకి దిగిన వన్డేల్లో... భారత్​ 31 మ్యాచుల్లో గెలిచి 10 మ్యాచ్​లు ఓడింది. ఇద్దరిలో ఒక్కరే ఉన్నప్పడు 19 విజయాలు, 9 పరాజయాలు, ఇద్దరూ ఆడనప్పుడు 5 విజయాలు, 4 అపజయాలతో రికార్డులు ఉన్నాయి.
  • భారత్​పై దక్షిణాఫ్రికా కెప్టెన్​ డికాక్​కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ బ్యాట్స్​మన్​ టీమిండియాపై 60.3 సగటుతో పరుగులు చేశాడు. భారత్​పై ఓపెనర్​గా బరిలోకి దిగి 500 పైచిలుకు పరుగులు చేసిన ఆటగాళ్లలో ఇతడి సగటు రెండో అత్యుత్తమం.
  • దక్షిణాఫ్రికాపై చాహల్​కు మంచి రికార్డు ఉంది. ఈ జట్టుపై ఇప్పటివరకు 7 మ్యాచ్​ల్లో 20 వికెట్లు తీశాడు. అన్ని జట్లతో పోలిస్తే ఇతడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. అంతేకాకుండా టాప్​-10 జట్ల గణాంకాలు చూస్తే ఇతడు సఫారీ జట్టుపైనే 15.65 సగటుతో అతితక్కువ పరుగులు ఇచ్చాడు.

ఇరుజట్ల వివరాలు:

భారత్‌: శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మనీష్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్​ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్‌ (కెప్టెన్‌), బావుమా, డస్సెన్‌, డుప్లెసిస్‌, వెర్రిన్నే, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్, జాన్​ జాన్‌ స్మట్స్‌, ఫెలుక్వాయో, లుంగి ఎంగిడి, సిపామ్లా, హెండ్రిక్స్‌, నోర్జె, జార్జ్‌ లిండె, కేశవ్‌ మహరాజ్‌

ABOUT THE AUTHOR

...view details