తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా అలవోక విజయం- సిరీస్​ 1-1తో సమం - సిరీస్​ 1-1తో సమం

చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్​తో జరిగిన చివరి టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కోహ్లీసేన ఇచ్చిన 135 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఛేదించేసింది సఫారీ జట్టు. ఫలితంగా ఆఖరి మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ సమం చేసుకుంది.

దక్షిణాఫ్రికా అలవోక విజయం... సిరీస్​ 1-1తో సమం

By

Published : Sep 22, 2019, 10:26 PM IST

Updated : Oct 1, 2019, 3:34 PM IST

తొలిసారి స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 కప్పు గెలవాలన్న టీమిండియా ఆశకు చెక్ పడింది. టీ20 ప్రపంచకప్​ ముందు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోహ్లీ సేనకు... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో షాకిచ్చింది సఫారీ జట్టు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్​ డికాక్​ అర్ధశతకంతో రాణించాడు.

కెప్టెన్​ ఇన్నింగ్స్​...

భారత్​ ఇచ్చిన 135 పరుగుల లక్ష్యాన్ని... వికెట్​ కోల్పోయి ఛేదించేసింది దక్షిణాఫ్రికా. ఛేజింగ్​లో సఫారీ జట్టు సారథి, ఓపెనర్​ క్వింటన్​ డికాక్​ 76 పరుగులు* (52 బంతుల్లో 6 ఫోర్లు​, 5సిక్సర్లు​) చెలరేగిపోయాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి... తన జట్టుకు ఘన విజయం అందించాడు.

మరో ఓపెనర్​ హెండ్రిక్స్​ 28 పరుగులతో (26 బంతుల్లో 4 ఫోర్లు​) మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి వికెట్​గా వచ్చిన భవుమా 27 పరుగులు (23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సారథికి మంచి సహకారం ఇచ్చాడు.

భారత బౌలర్లలో పాండ్యా 11కు పైగా సగటుతో పరుగులిచ్చినా ఒక వికెట్​ తీశాడు. జడేజా మినహా ఇతర బౌలర్లందరూ భారీగానే పరుగులిచ్చుకున్నారు.

ఈ విజయంతో సిరీస్​ను 1-1తో సమం చేసింది డికాక్​ సేన.. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బ్యాటింగ్​లో విఫలం​...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ రోహిత్​శర్మ(9) సిరీస్​లో మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 36 పరుగులతో(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించాడు. హిట్​మ్యాన్​ ఔట్​ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ 9 పరుగులకే పెవిలియన్​ చేరాడు.ఈ టోర్నీలో ప్రదర్శన కారణంగా నిరాశ ఎదుర్కొంటున్న రిషబ్​ పంత్​ 19 పరుగులు(20 బంతుల్లో 1ఫోర్​, 1 సిక్సర్​) మెరుగయ్యాడు.

సఫారీల పేస్​ ధాటికి మిగతా బ్యాట్స్​మెన్​ శ్రేయస్​ అయ్యర్​(5), కృనాల్​ పాండ్య(5) దారుణంగా విఫలమయ్యారు. ఆల్​రౌండర్లు హార్దిక్​ పాండ్య 14 పరుగులు(18 బంతుల్లో 1 ఫోర్​), రవీంద్ర జడేజా 19 రన్స్​(17 బంతుల్లో 1 ఫోర్​, 1సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి వల్లే స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్చ్యూన్​, హెండ్రిక్స్​ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షంశీ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు.

Last Updated : Oct 1, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details