తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ x పాక్​: నేడే అండర్​ 19 ప్రపంచకప్​ సెమీస్​​

కుర్రాళ్ల ప్రపంచకప్​లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు భారత్​, పాకిస్థాన్​ జట్ల మధ్య సెమీఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలోకి దిగిన టీమిండియా మరోసారి కప్పుగెలవాలని చూస్తోంది. పాక్​ ప్రత్యర్థి జట్టు జైత్రయాత్రను అడ్డుకోవాలని భావిస్తోంది. ఇద్దరిలో గెలిచిన జట్టు ఫైనల్​కు చేరనుంది. సెమీస్​ మ్యాచ్​ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

India vs Pakistan 2020
అండర్‌-19 ప్రపంచకప్‌: భారత్​X పాక్​ సెమీస్​ నేడే

By

Published : Feb 4, 2020, 7:38 AM IST

Updated : Feb 29, 2020, 2:28 AM IST

క్రీడ ఏదైనా.. టోర్నీ ఎక్కడైనా.. భారత్‌, పాక్‌ తలపడుతున్నాయంటే క్రీడా ప్రపంచం దృష్టంతా దానిపైనే! ఇక క్రికెట్లో పోటీపడుతున్నాయంటే.. ఆ మ్యాచ్‌పై అమితాసక్తి ఏర్పడుతుంది. మరోసారి అలాంటి రసవత్తర వినోదాన్ని పంచడానికి ఈ దాయాది దేశాలు సిద్ధమయ్యాయి. కీలకమైన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. అయితే అది సీనియర్‌ స్థాయిలో కాదు.. జూనియర్‌ క్రికెట్లో! అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో చోటు కోసం ఈ రెండు జట్లు బ్యాట్‌లు దూసుకోనున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ కుర్రాళ్ల సెమీస్‌ సమరం నేడు జరగనుంది. ఇందుకు దక్షిణాఫ్రికాలోని పోర్చెస్ట్రూమ్‌ వేదిక కానుంది.

పాంచ్​ పటాకా కోసం...

అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న యువ భారత్‌.. కీలక సమరానికి సిద్ధమైంది. ఇవాళ సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. వరుసగా మూడో సారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరాలంటే పాక్‌ గండాన్ని భారత్‌ దాటాల్సిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారతే.. ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. అయితే పాక్‌ను తేలిగ్గా తీసుకునే అవకాశమూ లేదు. ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌ చేరాయి. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించగా.. అఫ్గానిస్థాన్‌పై పాక్‌ గెలిచింది. దాయాదితో పోరు అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని మన ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే విజయం సాధ్యమవుతుంది.

యశస్వి జైస్వాల్‌

వీళ్లు ఆడితే:కప్పు గెలవడమే లక్ష్యంగా ఈ మెగాటోర్నీలో అడుగుపెట్టిన భారత్‌ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటుతోంది. గ్రూప్‌ దశలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌లో తడబడిన జట్టు పాక్‌తో పోరులో తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4 మ్యాచ్‌ల్లో 103.50 సగటుతో 207 పరుగులు)పైనే జట్టు ఆశలు పెట్టుకుంది. అతను అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు ఇబ్బందులు ఉండవు. కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌తో పాటు తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ బ్యాట్‌తో సత్తా చాటాలి. మరోవైపు బౌలింగ్‌లో జట్టు దుర్భేద్యంగా కనిపిస్తోంది. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ (4 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు)తో పాటు పేసర్లు కార్తీక్‌ త్యాగి (4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు), ఆకాశ్‌ సింగ్‌ బంతితో విజృంభిస్తున్నారు. సెమీస్‌లోనూ వాళ్లు రాణించి పాక్‌ బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకోవాలి.

రవి బిష్ణోయ్​

తక్కువేం కాదు: ప్రత్యర్థి పాక్‌ కూడా మంచి దూకుడు మీద ఉంది. అన్ని రంగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఆ జట్టు పేసర్లు అబ్బాస్‌ అఫ్రిది, మహమ్మద్‌ అమీర్‌ఖాన్‌, తాహిర్‌ హుస్సేన్‌ల బౌలింగ్​ ఎదుర్కొని పరుగులు చేయడం భారత బ్యాట్స్‌మన్‌కు సవాలే! మరోవైపు బ్యాటింగ్‌లో ఓపెనర్‌ హురైరా, మరో​ బ్యాట్స్​మన్​ రోహైల్​ నజీర్​ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో పాక్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టనుంది.

పాక్​ ఓపెనర్‌ హురైరా
పాక్​ బృందం

>> అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మధ్య ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. పాక్‌ అయిదు, భారత్‌ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. గత ప్రపంచకప్‌ (2018) సెమీస్‌లో భారత్‌ 203 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది.

Last Updated : Feb 29, 2020, 2:28 AM IST

ABOUT THE AUTHOR

...view details