జస్‌ప్రీత్ బుమ్రా.. గతేడాది వరకు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తూ టీమిండియాకు బలంగా కనిపించాడు. కానీ న్యూజిలాండ్ పర్యటనలో అతడు వికెట్లు తీయకపోవడం ఆందోళన కలిగించింది. కివీస్‌తో చివరి టీ20(3/12) మినహాయిస్తే.. అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మూడు వన్డేల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అయితే తాజాగా కివీస్‌తో తొలి టెస్టు మూడోరోజు ఎట్టకేలకు వికెట్ అందుకున్నాడు.
293 బంతుల తర్వాత..
గాయం కారణంగా అయిదారు నెలలు జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అప్పట్నుంచి ఏ సిరీస్‌లోనూ బుమ్రా నిలకడగా రాణించలేదు. 21 రోజుల నిరీక్షణ, 48 ఓవర్లు, 293 బంతుల తర్వాత వికెట్ సాధించాడు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే బుమ్రా వికెట్ అందుకున్నాడు. బీజే వాట్లింగ్‌ను బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం..
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 348 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై 183 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా బౌలర్లలో ఇశాంత్ శర్మ ఐదు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు.
ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్.. కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. ఫలితంగా కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్ల తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో టిమ్ సౌథీ(6) షమీకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 43(74 బంతుల్లో 5ఫోర్లు) కైల్ జేమిసన్ 44(45 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అశ్విన్ తొలుత 296 పరుగుల వద్ద జేమిసన్‌ను ఔట్ చేశాడు. కాసేపటికే గ్రాండ్‌హోమ్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే పంత్‌కు చిక్కాడు. తర్వాత అజాజ్ పటేల్(4)తో కలిసి ట్రెంట్‌బౌల్ట్ 38(24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడగా.. చివరికి ఇషాంత్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 348 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో ఇషాంత్(5), అశ్విన్(3), షమి(1), బుమ్రా (1) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది.