తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 5:31 AM IST

Updated : Feb 18, 2020, 4:56 AM IST

ETV Bharat / sports

భారత్​ X కివీస్​: నేడే తొలి టీ20.. గెలుపెవరిది?

ప్రపంచకప్​ సెమీస్​ తర్వాత భారత్​, న్యూజిలాండ్​ జట్లు మళ్లీ తలపడుతున్నాయి. నేడు అయిదు టీ20ల సిరీస్​లో భాగంగా ఆక్లాండ్​ వేదికగా మొదటి మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనున్నాయి ఇరుజట్లు. మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్​.. ఆనాటి మ్యాచ్​కు కౌంటర్​ ఇస్తుందా..? లేదా అనేది తేలనుంది. ఈ పోరు మధ్యాహ్నం 12.20 నిముషాలకు ప్రారంభం కానుంది.

India vs New Zealand 2020
భారత్​, న్యూజిలాండ్​ మధ్య ప్రేమపూర్వక టీ20 పోటీ

ప్రపంచ క్రికెట్​లో ప్రతిభావంతమైన సారథులు, వారికి తోడు సరైన బృందం ఉన్న జట్లలో భారత్​, న్యూజిలాండ్ టాప్​లో ఉంటాయి​. దూకుడు, మెరుపు ఆట కలగలిపిన కోహ్లీ ఒకవైపు... నెమ్మది, వ్యూహాత్మక నేర్పరితనం కూడిన సారథి విలియమ్సన్​ మరోవైపు. వీరిద్దరూ అండర్​-19 నుంచే అత్యుత్తమ సారథులు. మరి అలాంటి స్టార్​ ఆటగాళ్ల కెప్టెన్సీల్లోని జట్లు నేడు పొట్టి ఫార్మాట్​లో తలపడనున్నాయి. మ్యాచ్​ ఈరోజుమధ్యాహ్నం 12.20 నిముషాలకు ప్రారంభం కానుంది.

గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్‌లో కోహ్లీసేన 18 పరుగుల తేడాతో విలియమ్సన్‌ బృందం చేతిలోనే ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో భారత్​కు వరుణుడు అన్యాయం చేసినా.. కివీస్​ ప్రదర్శన తక్కువని చెప్పలేం. అయితే ఆ మెగాటోర్నీ తర్వాత తొలిసారి ఆ జట్టుతో పోటీపడనుంది మెన్​ ఇన్​ బ్లూ. అయితే పగ, ప్రతీకారం వంటి ఆలోచనలు లేవని ప్రేమపూర్వక పోటీ మాత్రమే ఉందచి మీడియాతో చెప్పాడు విరాట్​ కోహ్లీ. కివీస్‌ ఆటగాళ్లందరూ ఎంతో మంచివారని ప్రశంసించాడు.

" న్యూజిలాండ్‌ ఆటగాళ్లందరూ చాలా చాలా మంచివారు. వారితో ఆడుతుంటే ప్రతీకారం తీర్చుకోవాలని అస్సలు అనిపించదు. ఎన్నో ఏళ్లుగా మేం వారితో కలిసిమెలిసి ఆడుతున్నాం. ప్రతిసారీ మైదానంలో పోటీ గురించీ ధ్యాస ఉంటుంది. ఇంగ్లాండ్‌లో వారు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే దేశాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి బంతి, ప్రతి మ్యాచును అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తారు. అది వారి దేహభాషలోనే ప్రతిబింబిస్తుంది. నిరంతరం వారు సత్ప్రవర్తనతోనే మెలుగుతారు. మైదానంలో అంగీకారయోగ్యం కాని పనులు చేయరు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రయోజనం కివీస్‌కు ఉంటుంది. కానీ గతంలో మాకిక్కడ ఆడిన అనుభవం ఉంది. ప్రతి సిరీస్‌ను మేం తాజాగానే ఆరంభిస్తాం. న్యూజిలాండ్‌లో కివీస్​తో పోరు సవాలే. ఐతే మేం అందుకు సిద్ధం. అత్యుత్తమంగా ఆడతాం"

-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

రాహుల్‌కే ఓపెనింగ్​, కీపింగ్‌..?

యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్​లో ఓపెనింగ్​ బ్యాటింగ్​తో పాటు కీపింగ్​ చేసే అవకాశముంది. మరో ఓపెనర్​ రోహిత్​శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో శతకం బాది తన ఫామ్​ను కొనసాగించాడు.

వన్ డౌన్​లో విరాట్​ కోహ్లీ, మిడిలార్డర్​లో శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​ పాండే, జడేజా రాణిస్తున్నారు. బౌలర్లలో బుమ్రా, షమి, సైనీ అద్భుత ప్రదర్శన చేశారు. వీరికి తోడుగా శార్దూల్​ ఠాకూర్/శివమ్​ దూబేలో ఒకరు​, స్పిన్నర్లలో కుల్దీప్/చాహల్​లో ఒకరు​ బరిలోకి దిగే అవకాశముంది. ఈ మ్యాచ్​లో పంత్​, సంజు శాంసన్​కు అవకాశం రాకపోవచ్చు. అయితే ఈ మ్యాచ్​లో ఆరుగురు బౌలర్ల వ్యూహాన్ని అమలు చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది.

న్యూజిలాండ్​ బలంగానే...

స్టార్​ పేసర్లు బౌల్ట్​, ఫెర్గుసన్​ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా దూరమవడం వల్ల జట్టులో కాస్త పేస్ లోటు కనిపిస్తోంది. అయితే సౌథీ, స్టాట్ కుగ్గెలిజిన్ వంటి ఆటగాళ్లు తమ బౌలింగ్​తో అదరగొట్టగలరు. అంతేకాకుండా ఈ టోర్నీలో వెటరన్​ ఆటగాడు హమీష్​ బెన్నెట్​ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇతడు ఈ మధ్య కాలంలో దేశవాళీల్లో దుమ్ములేపాడు.

సారథి కేన్​ విలియమ్సన్​ కెప్టెన్సీ సహా మార్టిన్​ గప్తిల్​, మున్రో, టేలర్​, కొలిన్ డీ గ్రాండ్​హోమ్ వంటి సీనియర్లతో జట్టు బ్యాటింగ్​ కూడా బలంగానే ఉంది. అయితే టీ20ల్లో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో మిడిలార్డర్​ ఉండటం కాస్త మైనస్​ పాయింట్​. అయితే ఆ లోటు ఆల్​రౌండర్లు పూడ్చాల్సి ఉంటుంది. ఇరుజట్ల మధ్య గతేడాది మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 2-1 తేడాతో గెలిచింది కివీస్.

భారత్ టీ20​ జట్టు:

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ, కేఎల్​ రాహుల్​, శ్రేయస్​ అయ్యర్​, మనీష్​​ పాండే, రిషబ్​​ పంత్​ (కీపర్​), శివమ్​ దూబే, సంజు శాంసన్​, కుల్దీప్​ యాదవ్​, యజువేంద్ర చాహల్​, వాషింగ్టన్​ సుందర్​, జస్ప్రిత్​ బుమ్రా, మహ్మద్​ షమీ, నవదీప్​ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్​ ఠాకూర్​

న్యూజిలాండ్ టీ20 జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, కొలిన్ డీ గ్రాండ్​హోమ్, మార్టిన్ గప్తిల్, స్టాట్ కుగ్గెలిజిన్, డారిల్ మిచెల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథి.

Last Updated : Feb 18, 2020, 4:56 AM IST

ABOUT THE AUTHOR

...view details