ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే 2-2తో సిరీస్ సమం చేసిన ఇరుజట్లు.. సిరీస్ విజయం కోసం నిర్ణయాత్మక పోరులో తలపడనున్నాయి. టాస్ ఓడినప్పటికీ నాలుగో టీ20లో గెలిచి టీమ్‌ఇండియా ఊపుమీద కనిపిస్తుండగా.. టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకొనే లక్ష్యంతోనే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడుతోంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేపట్టింది. కీలక బృందాన్ని పరీక్షించింది. జట్టు కూర్పు, మేళవింపు, సమతూకం ఎలా ఉందో పరిశీలించింది. కుర్రాళ్ల కోసం స్వయంగా తన స్థానాన్ని త్యాగం చేసిన కోహ్లీ.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో దించి మెరుగైన ఫలితం రాబట్టాడు. ఇదే పంథాతో చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన బరిలోకి దిగనుంది.
ఆ ఇద్దరి ఆటపై సంతృప్తి..
ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పట్ల జట్టు సంతోషంగా ఉంది. ఏమాత్రం భయం లేకుండా ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీరిద్దరు జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్‌లా మారారు. ప్రత్యర్థి ఎంతటి బౌలరైన బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడుతున్నారు. నాలుగో ట్వంటీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ తన సామర్థ్యాన్ని చాటిచెప్పాడు. తద్వారా ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలిమ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి రాణించడం సులభం కాదని.. సూర్య బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయినట్లు కోహ్లీ వ్యాఖ్యానించాడు.