రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు టీమ్‌ఇండియాను ఓడించడం అంత తేలిక కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశాడు. 2012లో అలిస్టర్ కుక్ నేతృత్వంలో ఇంగ్లాండ్ జట్టు.. భారత్‌లో 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఆ సమయంలో ఫ్లవర్ ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే తాజా సిరీస్‌పై స్పందిస్తూ.. నాటి జట్టు కంటే ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టుకు భారత్‌ను ఓడించడం కష్టమని పేర్కొన్నాడు.
"భారత్‌తో టెస్టు సిరీస్ క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్నది. అప్పటి మా జట్టు కన్నా ఇప్పటి ఇంగ్లాండ్ జట్టుకు అది ఇంకా కష్టం. ఆస్ట్రేలియాపై విజయం సాధించాక టీమ్ ఇండియా మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లోనూ చాలా బలంగా కనిపిస్తోంది. అయితే, మేం భారత్‌లో పర్యటించినప్పుడు కుక్ ఎలా ఆడాడో ఇప్పుడు జోరూట్ కూడా అలాగే ఆడాలి. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ భారీ పరుగులు చేయాలి. తర్వాత బట్లర్, బెన్‌స్టోక్స్ లాంటి ఆటగాళ్లు కావాలి. వారు పీటర్సన్‌లా ఆడాలి. ఈ ముగ్గురూ చెలరేగి టీమ్‌ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలి" అని ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.