తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టీ20: మ్యాచ్​ గెలిచి సిరీస్​ను సమం చేస్తారా? - మొతేరా టీ20

ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 2-1 ఆధిక్యంతో ఉన్న ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్​ నెగ్గి సిరీస్​ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. నాల్గో టీ20లో గెలిచి సిరీస్​ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉంది. టాస్​ కీలక పాత్ర పోషిస్తున్న మొతేరా పిచ్​పై ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

india vs england fourth t20 preview
మ్యాచ్​ గెలిచి పోటీలో ఉంటారా.. పట్టు తప్పుతారా

By

Published : Mar 18, 2021, 5:31 AM IST

సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ గెలిచి ఊపుమీద కనిపించిన టీమ్​ఇండియా.. టీ20ల్లో మాత్రం ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతుంది. ఐదు మ్యాచ్​ల పొట్టి సిరీస్​లో ఇప్పటికే మూడు మ్యాచ్​లు ముగిశాయి. ఇంగ్లాండ్​ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తదుపరి మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి సిరీస్​ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఆతిథ్య భారత్​ యోచిస్తోంది. మరో వైపు మోర్గాన్ సేన కూడా నాల్గో టీ20ని నెగ్గి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. టాస్​ కీలక పాత్ర పోషిస్తున్న మొతేరా పిచ్​పై భారత్​ ఆల్​రౌండ్ ప్రదర్శన చేస్తేనే తదుపరి మ్యాచ్​ గెలిచే అవకాశం ఉంది.

కలవరపెడుతున్న ఓపెనింగ్..

టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్​ ఫామ్​ భారత్​ను కలవరపరుస్తోంది. తొలి మ్యాచ్​లో కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్​ చేరిన రాహుల్​.. మిగతా రెండు టీ20ల్లో డకౌట్​గా వెనుదిరిగాడు. అయినప్పటికీ.. తదుపరి మ్యాచ్​లకు కూడా రాహుల్​ను పక్కన పెట్టేది లేదని కెప్టెన్ కోహ్లీతో పాటు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో రోహిత్-రాహుల్ జోడీనే తమ మొదటి ప్రాధాన్యం అని విరాట్ ఇప్పటికే​ స్పష్టం చేశాడు. వరుస వైఫల్యాలు ఉన్నప్పటికీ.. ఒక్క ఇన్నింగ్స్​తో రాహుల్​ తిరిగి గాడిలో పడతాడని రాఠోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ రాహుల్​కు విశ్రాంతినిచ్చిన అతని స్థానాన్ని సూర్యకుమార్​ యాదవ్​తో భర్తీ చేయొచ్చు. అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్​ కిషన్..​ రోహిత్​తో కలిసి ఇన్నింగ్స్​ను ప్రారంభించే అవకాశాలూ ఉన్నాయి.

రెండుసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా పవర్​ ప్లే ఓవర్లలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. ఆర్చర్​, మార్క్​ ఉడ్​ బౌలింగ్​ను ఎదుర్కోలేక త్వరగా వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ సుడిగాలి ఇన్నింగ్స్​ ఆడుతున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలవలేకపోతున్నాడు. బ్యాట్స్​మెన్​ రాణిస్తున్నప్పటికీ.. పెద్ద లక్ష్యాలను ప్రత్యర్థి ముందు ఉంచలేకపోతుంది కోహ్లీ సేన.

బౌలర్లు రాణించాలి..

గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ప్రధాన పేసర్​ భువనేశ్వర్ కుమార్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాట్స్​మెన్​కు కళ్లెం వేయలేక పోతున్నాడు. స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టే యుజ్వేంద్ర చాహల్​ వికెట్లు తీయకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటికే హర్దిక్​, సుందర్​ ఉన్నప్పటికీ.. మరో ఆల్​రౌండర్​ను తుది జట్టులోకి తీసుకోవాలని భారత్ భావిస్తోంది. అదే కనుక చేస్తే రాహుల్ తెవాతియాకు అరంగేట్రం చేసే అవకాశం దక్కొచ్చు. లోకల్ బాయ్​ అక్షర్​ పటేల్​కు అవకాశం లేకపోలేదు. బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లీ, ఇషాన్ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసి వచ్చే అంశం. సిరీస్‌లో 1-2తో వెనుకబడినప్పటికీ నాలుగో మ్యాచ్‌ కోసం భారత జట్టులో భారీ మార్పులేమీ ఉండకపోవచ్చు.

టాస్​​ గెలిస్తేనే..

ఏదేమైనా టాస్​ కీలక పాత్ర పోషిస్తున్న మొతేరా పిచ్​పై టాస్​ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మూడు మ్యాచ్​ల్లో రెండు సార్లు టాస్​ ఓడిన కోహ్లీ.. ఈ మ్యాచ్​లో టాస్​ గెలవడం ముఖ్యం. మ్యాచ్​ ఆసాంతం పిచ్​ భిన్నంగా స్పందిస్తోంది. తొలుత బౌలింగ్​ చేసే జట్టుకు పేస్​ అనుకూలిస్తూనే.. ఛేదనలో బ్యాటింగ్​కు సహకరిస్తుంది.

పట్టుదలతో ఇంగ్లాండ్..

నాల్గో టీ20లో నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని మోర్గాన్ సేన పట్టుదలతో ఉంది. ఓపెనర్లు బట్లర్‌, రాయ్‌లతో పాటు బెయిర్‌స్టో అద్భుత ఫామ్‌లో ఉండటం ఇంగ్లాండ్​కు కలిసొస్తుంది. పొట్టి ఫార్మాట్​లో నంబర్‌ వన్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ అంచనాలు అందుకోలేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌ విభాగంలో మార్క్‌వుడ్‌, ఆర్చర్‌, సామ్‌ కరన్‌ అంచనాల మేరకు రాణిస్తుండటం ఇంగ్లిష్‌ జట్టుకు సానుకూలాంశం. గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:మణికట్టు మాయాజాలమేది యూజీ?

ABOUT THE AUTHOR

...view details