భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్ మీదే ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పిచ్‌లు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ టెస్టు సిరీస్ అంటే మాత్రం సాధారణంగా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్ సిద్ధం కావడం మామూలే. ఉపఖండ జట్లు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ దేశాలకు వెళ్లినపుడు పేస్ పిచ్‌లే స్వాగతం పలుకుతాయి. ఆ జట్లు ఉపఖండానికి వస్తే స్పిన్ వికెట్లు పలకరించడమూ మామూలే. అయితే ఈ సానుకూలత ఏమేరకు ఉంటుందన్నది ఆయా జట్ల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. చెన్నైలో తొలి టెస్టుకు ఎక్కువగా బ్యాటింగ్‌కు సహకరిస్తూ, చివరి రెండు మూడు రోజుల్లో స్పిన్‌కు సహకరించే పిచ్‌ను సిద్ధం చేశాడు క్యురేటర్. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలి రెండు రోజుల్లో పరుగుల పండుగ చేసుకుంది. తర్వాత స్పిన్‌తో భారత్‌ను దెబ్బ తీసింది. కోహ్లీసేనను అనూహ్య పరాజయం పలకరించింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కు భారత్ తన బలాన్ని నమ్ముకుంది. స్పిన్ పిచ్‌తో పర్యటక జట్టును దెబ్బకు దెబ్బ తీసింది.
ఇక మొతేరాలో ఏం జరిగిందో తెలిసిందే. మళ్లీ స్పిన్ వికెట్టే సిద్ధమైంది. గులాబి బంతితో స్పిన్నర్లు మరింతగా విజృంభించారు. భారత బ్యాట్స్‌మెన్ సైతం తడబడ్డప్పటికీ.. మన జట్టులో నాణ్యమైన స్పిన్నర్లుండటం కలిసొచ్చి ఇంగ్లిష్ జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే సొంతగడ్డపై పేస్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో ఇంగ్లాండ్ ఉపఖండ జట్లను దెబ్బ తీస్తున్నపుడు మహ బాగా ఆస్వాదించే ఆ జట్టు మద్దతుదారులు మొతేరా పిచ్‌పై గగ్గోలు పెట్టేశారు. ఇలా అయితే టెస్టు క్రికెట్ చచ్చిపోతుందన్నట్లుగా మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలకు మన వాళ్లు దీటుగానే స్పందించారు. పేస్ పిచ్‌లపై రెండు మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల మాటేంటి అన్నారు. భారత జట్టు ఎప్పుడైనా పేస్ పిచ్‌లపై ఫిర్యాదులు చేసిందా అని ప్రశ్నించారు. దీనికి అటు వైపు నుంచి సమాధానం లేదు. అయితే గత మ్యాచ్ సంగతలా వదిలేస్తే.. చివరి టెస్టుకు పిచ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం.