తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 6:53 PM IST

Updated : Nov 21, 2019, 7:06 PM IST

ETV Bharat / sports

చారిత్రక 'గులాబి' సంగ్రామానికి వేళాయే

భారత్​-బంగ్లాదేశ్​ జట్లు తొలిసారి డే/నైట్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి. కోల్​కతాలోని ఈడెన్​గార్డెన్స్​ వేదికగా రేపు(శుక్రవారం) ఈ మ్యాచ్​ జరగనుంది. ఇరుజట్లు ఫ్లడ్​లైట్ల వెలుతురులో గులాబి బంతితో ఆడనున్నాయి. ఈ సందర్భంగా జట్ల బలాబలాలు ఓసారి చూద్దాం.

భారత్​-బంగ్లా: చారిత్రక గులాబి సంగ్రామానికి వేళాయెరా..!

క్రికెట్​లో టెస్టు హోదా పొందిన టాప్​-10 జట్లలోఇప్పటివరకు డే/నైట్​ టెస్టు ఆడనివి భారత్​, బంగ్లాదేశ్​ మాత్రమే. నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్​ల్ని అన్ని దేశాలు ఆడేశాయి. తాజాగా భారత్​కు ఆ ఘనతను అందించేందుకు ముందడుగు వేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

టింకు-పింకు మస్కట్​తో గంగూలీ

నూతన అధ్యయమే...

ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినదాదా... గులాబి బంతితో టెస్టు కోసం భారత కెప్టెన్​ కోహ్లీని, బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించాడు. భారత్​ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్​... ముందుగా ఒప్పందం చేసుకోకపోయినా, అనూహ్యంగా దాదా నిర్ణయానికి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ టెస్టు కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన భారత క్రికెట్ బోర్డు.. నూతన అధ్యయానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అయితే ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్​బాల్​ కనిపించదని కొందరు.. అలవాటు పడితే కష్టమేమీ కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టుకు 'సిటీ ఆఫ్‌ జాయ్‌'గా పిలుచుకునే కోల్‌కతా సిద్ధమైంది.

ఈడెన్​ గార్డెన్స్​

12వ టెస్టు సిరీస్​...

సొంతగడ్డపై టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న కోహ్లీసేన... ఈ మ్యాచ్​లోనూ గెలిచి మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 11 టెస్టు సిరీస్​లను ఖాతాలో వేసుకుంది భారత్. ఈ మ్యాచ్​ గెలిస్తే వరుసగా మూడో సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేస్తుంది​.

ఇటీవల జరిగిన టెస్టు సిరీస్​ల్లో వెస్టిండీస్​(2 మ్యాచ్​లు), దక్షిణాఫ్రికా(3 మ్యాచ్​లు)పై గెలిచి రెండు సిరీస్​లు క్లీన్​స్వీప్​ చేసింది కోహ్లీసేన. ఇప్పటికే బంగ్లాపై రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో భారత్ఉంది.

గులాబి బంతి

పదునైన అస్త్రాలు...

భారత బ్యాటింగ్​ విభాగంలో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్‌ కోహ్లీ, టెస్టు స్పెషలిస్టులు పుజారా, రహానేలతో భారత్‌ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉంది.

బౌలింగ్‌ దళంలో పేసర్లు ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్ యాదవ్‌.. గత టెస్టులో సత్తా చాటారు. ముగ్గురూ కలిసి 14 వికెట్లు పడగొట్టారు. వీరంతా రాణిస్తే బంతి రంగు అనేది పెద్ద విషయం కాదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

మ్యాచ్‌లో లంచ్‌ తర్వాతి సెషన్‌ కీలకంగా ఉండనుంది. చివరి సెషన్‌లో స్వింగ్‌, రివర్స్‌స్వింగ్‌ రాబట్టేందుకు బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గులాబి బంతి స్పిన్నర్లకు సహకరించదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో స్పిన్నర్ల నుంచి అంతగా ప్రదర్శన ఆశించలేమని ఇప్పటికే పలువురు మాజీలు స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లలో చాలా మందికి దులీప్‌ ట్రోఫీలో గులాబీ బంతితో డే/నైట్‌మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.

బంగ్లా రాణించాల్సిందే...

బంగ్లాదేశ్‌ మొదటిసారి గులాబి బంతితో ఆడనుంది. ఆ జట్టు ఇంతవరకు ఇలాంటి సవాలును ఎదుర్కోలేదు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించిన తొలి టెస్టులో అబూజాయేద్‌ మినహా బంగ్లా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.

బ్యాటింగ్‌లోనూ ముష్ఫీకర్‌ రహీమ్​ కాకుండా మరో ఆటగాడు 50 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌ నిషేధం నేపథ్యంలో జట్టు పగ్గాలు స్వీకరించిన మోమినుల్‌ హక్‌ ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు.

భిన్న వాదనలు...

ఈ పింక్‌బాల్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చీకటి పడ్డాక గులాబీ బంతిని చూడడం కష్టంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంచు కూడా ఇబ్బందిగా మారుతుందన్నారు. అయితే బంతికి తడి తగిలితే అది స్వింగ్‌ కాదు. వీటిని అధిగమిస్తూ ప్రయోగాత్మకంగా భారత్​-బంగ్లా తొలిసారి ఈ బంతితో ఆడనున్నాయి.

టెస్టులకు ఆదరణ కరవవుతున్నందున ప్రేక్షకులను మైదానానికి రప్పించేందుకు ఇలాంటి నిర్ణయాలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. టీమిండియా ఈ మ్యాచ్‌ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మొదటిస్థానాన్ని మరింత పదిలపరుచుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరుజట్లు..

భారత్​:

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​శర్మ, మయాంక్​ అగర్వాల్​, చతేశ్వర్​ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్​ సాహా(కీపర్​), రవిచంద్ర అశ్విన్​, రవీంద్ర జడేజా, రిషబ్​ పంత్​, మహ్మద్​ షమి, ఇషాంత్​ శర్మ, ఉమేశ్​ యాదవ్​, హనుమ విహారి, కుల్దీప్​ యాదవ్​, శుభ్​మన్​ గిల్

బంగ్లాదేశ్​:

మొమినుల్​ హక్​(కెప్టెన్​), లిటన్​ దాస్​(కీపర్​), మెహిదీ హసన్​, నయీమ్​ హసన్​, అల్​ అమిన్​ హొస్సేన్​, ఎబొడాట్​ హొస్సేన్​, మొసదెక్​ హొస్సేన్​, షాద్​మన్​ ఇస్లామ్​, తైజుల్​ ఇస్లాం, అబు జాయెద్​, ఇమ్రుల్​ కేయిస్​, మహ్మదుల్లా, మహ్మద్​ మిథున్​, ముష్ఫికర్​ రహీమ్​, ముస్తాఫిజుర్​ రహ్మన్​

Last Updated : Nov 21, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details