భారత సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అతడి ఆటోగ్రాఫ్ కోసం, ఫొటోల కోసం పోలీసుల భద్రతావలయం, బారికేడ్లు దాటుకొని మరీ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
తాజాగా ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టులో శనివారం ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ కోహ్లీ దగ్గరికి చేరుకున్నాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా మైదానం నుంచి అతడిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ కోహ్లీ అలా చేయవద్దని సిబ్బందికి సూచించాడు. కొద్దిసేపు అతడి భుజంపై చేయి వేసి ముచ్చటించాడు. అనంతరం భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమాని పట్ల కోహ్లీ స్పందించిన తీరుని నెటిజన్లు కొనియాడుతున్నారు.