తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతా సర్వం.. 'గులాబి' మయం - చారిత్రక  డే/నైట్​ టెస్టు

బంగ్లా-భారత్​ జట్ల మధ్య చారిత్రక  డే/నైట్​ టెస్టు మ్యాచ్​ ​కోసం కోల్​కతాలోని ఈడెన్​గార్డెన్స్​ ముస్తాబవుతోంది. నవంబర్​ 22 నుంచి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్​ కోసం స్టేడియం సహా పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

టెస్టు మ్యాచ్​ కోసం గులాబి రంగులోకి కోల్​కత్తా

By

Published : Nov 18, 2019, 5:40 AM IST

భారత్ - బంగ్లాదేశ్​ జట్లు​ తొలిసారి డే/నైట్ టెస్టు మ్యాచ్​ ఆడనున్నాయి. శుక్రవారం(నవంబర్​ 22)న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్​ కోసం కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ మైదానం సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గులాబి రంగుతో కళకళలాడనున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. 'పింకూ-టింకూ' పేరుతోతాజాగా అధికారిక మస్కట్లనూ విడుదల చేశాడు. మ్యాచ్​ టికెట్టు సహా మస్కట్లను ఈడెన్​ మైదానంలో ప్రదర్శించాడు దాదా.

పింకూ-టింకూ మస్కట్లతో గంగూలీ

గులాబిమయం...

ఈడెన్​ మైదానంలో పెద్ద గులాబి బెలూన్​ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఇది ఐదురోజులు కనువిందు చేయనుంది. షాహిద్​ మినార్​, ఎత్తైన భవంతులు, పార్కులను గులాబి రంగు విద్యుత్తు కాంతులతో అలంకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. హూగ్లీ నదిపైన ఓ పడవను గులాబి రంగులో ఏర్పాటు చేయనుంది. ఎల్​ఈడీ బోర్డులు, బస్సుల్లోనూ మ్యాచ్​కు ప్రచారం కల్పించనున్నారు. ఫలితంగా టెస్టులపై మరింత ఆసక్తి ఏర్పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజులకు పూర్తిగా టికెట్లు అమ్ముడైనట్లు దాదా వెల్లడించాడు.

గోడలపైనా క్రికెట్​కు సంబంధించిన చిత్రాలను ముద్రించేందుకు ఇప్పటికే క్యాబ్(బెంగాల్​ క్రికెట్​ అసోసియేషన్​) ​ఓ ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించింది. రాత్రి, పగలు కష్టపడుతూ 20 మంది కళాకారులు రంగులు వేస్తున్నారు. మైదానానికి వచ్చే రోడ్లు పూర్తిగా గులాబి రంగులో ఆటగాళ్లకు స్వాగతం పలకనున్నాయి.

గోడలపై పెయింటింగ్​లు వేస్తున్న కళాకారులు

గంట మోగగా​.. గాల్లోంచి బంతులు

మ్యాచ్​ తిలకించేందుకు బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా, బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మ్యాచ్​ ఆరంభానికి ముందు వీరిద్దరూ మైదానంలోని గంటను మోగిస్తారు.ఆర్మీకి చెందిన పారా స్టూపర్లు బంతులను ఆకాశం నుంచి నేలపైకి తీసుకురానున్నారు. ఆ తర్వాత టాస్​ వేసి మ్యాచ్​ ప్రారంభిస్తారు.

పారాట్రూపర్లతో టీమిండియా కోచ్​ రవిశాస్త్రి
  • 20 నిముషాల టీ బ్రేక్​లో.. మాజీ కెప్టెన్లు, క్రీడా ప్రముఖులు, మిగతా అతిథులు కలిసి బౌండరీ లైన్​ చుట్టూ మైదానం అంతా చక్కర్లు కొడతారు.
  • 40 నిముషాల డిన్నర్​ బ్రేక్​లో చిన్నపాటి టాక్​ షో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దిగ్గజ క్రీడాకారులు సచిన్​ తెందూల్కర్​, రాహుల్​ ద్రవిడ్​, అనీల్​ కుంబ్లే, వీవీఎస్​ లక్ష్మణ్​ కలిసి 2001లో ఆసీస్​పై టెస్టు మ్యాచ్​ విజయంపై మాట్లాడనున్నారు.

భారత ప్రముఖ క్రీడాకారులు సచిన్​ తెందూల్కర్​, ఒలింపిక్​ ఛాంపియన్​ అభినవ్​ బింద్రా, టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ పీవీ సింధు, ఆరుసార్లు బాక్సింగ్​ ఛాంపియన్​ మేరీకోమ్​ కోసం ప్రత్యేక అభినందన కార్యక్రమం ఉండనుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్​-భారత్​ జట్లకు సన్మానం చేయనుంది బీసీసీఐ.

ABOUT THE AUTHOR

...view details