తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2019, 6:21 AM IST

ETV Bharat / sports

ఈడెన్​లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్​ సమయం ఖరారు..

టీమిండియా తొలిసారి ఆడనున్న డే/నైట్​ టెస్టు మ్యాచ్​ రాత్రి 8 గంటల వరకే నిర్వహించనుంది బీసీసీఐ. ఆ తర్వాత మంచు ప్రభావం వల్ల ఆట కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ నెల 22 నుంచి 26 వరకు గులాబి బంతితో సుదీర్ఘ మ్యాచ్​ ఆడనున్నాయి భారత్​-బంగ్లా జట్లు.

ఈడెన్​లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్​ల సమయం ఖరారు..!

కోల్‌కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య చారిత్రక డే/నైట్ టెస్టు జరగనుంది. తొలిసారి ఇరుజట్లు ఈ పద్ధతిలో​ మ్యాచ్​ను ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్​ను మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనుంది బీసీసీఐ. రాత్రి 8 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ముందుగానే మ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

"బంగాల్‌ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్‌) అభ్యర్థన మేరకు ఆట నిర్వహణ సమయంలో మార్పులు చేస్తున్నాం. మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభిస్తాం. తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. 3:40కి ప్రారంభమయ్యే రెండో సెషన్‌ సాయంత్రం 5:40వరకు కొనసాగుతుంది. ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఫలితంగా మ్యాచ్‌పై మంచు తీవ్రత అంతగా ఉండదు."

- బీసీసీఐ అధికారి

మంచు ప్రభావాన్ని అధిగమించడానికి మ్యాచ్‌ను ముందుగా నిర్వహించాలని క్యాబ్‌ క్యురేటర్‌ సుజన్‌ తెలిపారు. "మంచు తీవ్రత రాత్రి 8 నుంచి 8.30 వరకు అధికమవుతుందని గత కొన్ని మ్యాచుల్లో పరిశీలించాం. అందుకే ఆట సమయంలో మార్పులు చేస్తే ఆ సమస్య అధిగమించవచ్చు. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేసే పిచ్‌లనే డే/నైట్ టెస్టుకు తయారుచేస్తాం. దీనిలో పెద్దగా మార్పులు ఏమి ఉండవు" అని వెల్లడించారు.

భారత్‌ ఆడుతున్నతొలి డే/ నైట్‌ టెస్టును వీక్షించేందుకు... తొలి మూడు రోజులు దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి రావచ్చని అంచనా వేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details