అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు రోహిత్ శర్మ. దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బంగ్లాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
కోహ్లీని వెనక్కి నెట్టి...
టీ20ల్లో అగ్రస్థానం కోసం విరాట్ కోహ్లీ-రోహిత్ మధ్య చాలా రోజులుగా పోటీ కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ రికార్డును అధిగమించాడు రోహిత్‌శర్మ. ఈ జాబితాలో రోహిత్(2,452) తొలి స్థానం దక్కించుకొని... కోహ్లీ(2,450) రెండో స్థానానికి నెట్టాడు..
పాక్ ఆటగాళ్లకు పోటీ...
2007లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు రోహిత్. దాదాపు 12 ఏళ్ల కెరీర్లో ఈరోజు మ్యాచ్‌తో కలిపి 99 టీ20లు ఆడాడు. ఫలితంగా ధోనీ(98) రికార్డును అధిగమించాడు. ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిదీ(99)తో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాడు. వీరిద్దరి కంటే ముందు షోయబ్ మాలిక్(111) మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యచ్‌లో ఆ రికార్డు కుదరలేదు...
బంగ్లాపై తొలి టీ20లో రోహిత్ శర్మ దుమ్ములేపుతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆరంభంలోనే 2 ఫోర్లతో దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్.. కేవలం 9 పరుగులు( 5 బంతుల్లో) చేసి ఔటయ్యాడు. షఫియిల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం 22 హాఫ్ సెంచరీలతో ముందంజలో ఉండగా, రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ నాలుగు శతకాలు, 17 అర్ధశతకాలు కలిపి మొత్తం 21సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే కోహ్లీ సరసన చేరతాడని అభిమానులు భావించారు. అయితే వచ్చే రెండు మ్యాచ్‌ల్లో కనీసం రెండు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. విరాట్ రికార్డు బ్రేక్ అవుతుంది.