దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టీ20లో బంగ్లా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా... టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇది టీ20 చరిత్రలో 1000వ మ్యాచ్ కావడం విశేెషం.
దూబేకు అవకాశం...
తొలి టీ20లో టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ముంబయి ఆటగాడు దూబే. ఈ మ్యాచ్ ద్వారా తొలిసారి అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేస్తున్నాడీ యువ క్రికెటర్. పంత్‌కు కీపర్‌గా అవకాశమివ్వగా... కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది.
బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మద్ నయీమ్... ఇదే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20లకు అరంగేట్రం చేస్తున్నాడు.
రికార్డు విజయాలు...
ఇప్పటివరకు బంగ్లాపై ఆడిన 8 టీ20 మ్యాచ్‌ల్లో అన్నింటా గెలుపొందింది భారత జట్టు. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది టీమిండియా.
పాకిస్థాన్ 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా తొలిస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాపై ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది భారత్. అయితే టీమిండియా వరుస విజయాలకు చెక్ పెట్టాలని బంగ్లా కూడా పట్టుదలగా ఉంది.
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు షకిబ్ అల్ హసన్ రెండేళ్ల పాటు ఆటకు దూరం కాగా, తమీమ్ ఇక్బాల్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా మంచి పట్టుదలతో కనిపిస్తుంది పసికూన జట్టు.
స్టేడియం మరింత ప్రత్యేకం..
- అరుణ్ జైట్లీ (ఫిరోజ్‌షా కోట్లా) స్టేడియంలో భారత్ ఒకే ఒక్క టీ20 ఆడింది. 2017 నవంబరు 1న న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- ఈ వేదికలో జరిగిన టీ20ల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 157. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 143.
- ఈ స్టేడియంలో 202 అత్యధిక స్కోరు. 2017లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించింది.
- బంగ్లాదేశ్-భారత్ మధ్య 8 టీ20లు జరిగాయి. అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. అయితే రెండు జట్లూ ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కసారీ తలపడలేదు. ఈరోజే తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికయ్యాక టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. చివరి వరకు మ్యాచ్ రద్దు చేయకుండా అద్భుతంగా మ్యాచ్ నిర్వహించడంలో సఫలమయ్యాడు దాదా.
ఇరు జట్లు
భారత జట్టు..
రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యుజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకుర్
బంగ్లా జట్టు..
మహ్మదుల్లా(కెప్టెన్), సౌమ్య సర్కార్, మహ్మద్ నయీమ్, ఆఫిఫ్ హొస్సేన్, మొసదెక్ హొస్సేన్, అమినుల్ ఇస్లాం, లిటన్ దాస్ ముష్ఫికర్ రహీమ్, అరాఫత్ సన్నీ, అల్అమిన్ హొస్సేన్, ముష్ఫికర్ రహ్మాన్, షైఫుల్ ఇస్లాం