ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్... నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. శిఖర్ ధావన్ (96), కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80) ధాటిగా ఆడారు. అనంతరం ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్మిత్(98), లబుషేన్(44) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
ఈ మైదానంలో...
>> భారత జట్టుకు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి విజయం. గతంలో జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా ఓటమిపాలైంది.
>> స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో గత నాలుగు వన్డేల్లో ఓటమిపాలై రాజ్‌కోట్‌లో తొలి విజయం సాధించింది.
>> ఒక్క బ్యాట్స్‌మన్ కూడా శతకం సాధించకుండా అత్యధిక పరుగులు నమోదు చేసిన మ్యాచ్‌గా ఈ వన్డే రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 644 పరుగులు నమోదయ్యాయి.
టీమిండియా అదుర్స్...
>>ఆస్ట్రేలియాపై 300కు పైగా స్కోరు సాధించి గెలిచిన జట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇలా 11 సార్లు ఆసీస్ జట్టును ఓడించింది. దక్షిణాఫ్రికా(10), ఇంగ్లాండ్(9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
>>వన్డేల్లో 340 పరుగులకు పైగా స్కోరు సాధించిన భారత జట్టు.. 28 సార్లు విజయం సాధించింది. ఒక్క సారి మాత్రమే ఓటమిపాలైంది. అదీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం విశేషం.
>> వన్డేల్లో 300 పైగా స్కోరు సాధించిన జట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు టీమిండియా 113 సార్లు భారీ స్కోర్లు సాధించగా... ఆస్ట్రేలియా(107), దక్షిణాఫ్రికా(84), పాకిస్థాన్(81), ఇంగ్లాండ్(78) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఆటగాళ్ల జోరు...
>>కుల్దీప్ యాదవ్ భారత స్పిన్నర్లలో అరుదైన రికార్డు అందుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో(58) వంద వికెట్లు పడగొట్టాడు.
>> ఈ ఏడాది వన్డేల్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు కేఎల్ రాహుల్. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా వేయి పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు రాహుల్. 27 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇతడి కంటే ముందు కోహ్లీ(24), ధావన్(24), సిద్ధు(25) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నారు.
>> ఆసీస్ జట్టుపై 4000 వేల పరుగులు వేగంగా చేసిన రెండో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు కోహ్లీ. సచిన్(83 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 86 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు.
>>వన్డేల్లో వేగంగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 137 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఆమ్లా (147), సచిన్ (160) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.