సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (80), మాక్స్‌వెల్ (54) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (85) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. స్వెప్సన్ (3/23) టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. ఈ విజయంతో ఆసీస్ 1-2తో మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ తప్పించుకుంది.
మాక్సీ-వేడ్ ధనాధన్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్ ఫించ్‌ను ఖాతా తెరవకముందే సుందర్ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్ (24)తో కలిసి వేడ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్‌ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్ తెరదించాడు. ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్ అవకాశమే ఇవ్వలేదు.
పేలవమైన ఫీల్డింగ్