ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.3 ఓవర్లలో 159 రన్స్‌కు ఆలౌట్ అయింది కంగారూ జట్టు. నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన కార్తీక్ త్యాగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
ఫానింగ్ కాస్త భయపెట్టాడు..
మోస్తరు లక్ష్య ఛేదనలో ఆరంభ ఓవర్లోనే టపటపా వికెట్లు కోల్పోయింది ఆసీస్. పేసర్ కార్తీక్ త్యాగి దెబ్బకు 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నలుగురూ వరుసగా 0, 4, 0, 2 స్కోర్లు మాత్రమే సాధించారు. ఆ సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు మరో ఎండ్ ఓపెనర్ సామ్ ఫానింగ్. 127 బంతులాడి 75 రన్స్ చేశాడు. పాట్రిక్ రో 41 బంతుల్లో 21, స్కాట్ 75 బంతుల్లో 35 పరుగులు చేసి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని కాసేపు భయపెట్టిన సామ్.. విజయానికి 79 పరుగుల దూరంలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ పరాజయం ఖాయమైంది. ప్రత్యర్థిని 43.3 ఓవర్లలో 159 పరుగులకే చుట్టేశారు భారత బౌలర్లు.