భారత్-పాకిస్థాన్ కలిసి ఆడిన సిరీస్‌ల్లో 1999లో జరిగిన టెస్టు సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమైందని తెలిపాడు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. భారత గడ్డపై ఒత్తిడిలోనూ గెలవడం, ఓడడం ఓ ప్రత్యేక అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో జరిగిన ఆడియో ఆధారిత ఇంటర్వ్యూలో అక్రమ్ వెల్లడించాడు.
"90ల్లో మాకు భారత్‌కు మధ్య అనేక మ్యాచ్‌లు జరిగాయి. అయితే వాటిలో 1999లో జరిగిన టెస్టు సిరీస్ నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఆ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టుకు నేనే కెప్టెన్. తొలి మ్యాచ్ చెన్నైలో జరిగింది. మైదానంలోకి వెళ్లే ముందు మా జట్టు ఆటగాళ్లతో మాట్లాడాను. స్డేడియం అంతా నిశ్శబ్దంగా ఉంటే మన పని మనం బాగా చేస్తున్నట్లు అర్థమని చెప్పాను. భారత్‌లో మా జట్టుకు మద్దతు ఎలా అయితే లభించదో.. అదే విధంగా పాక్‌లో భారత్‌కు సపోర్ట్ ఉండదు."