అది 2015.. బెంగళూరులో భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతోంది. క్రీజులోకి ఓ బ్యాట్స్‌మన్ వచ్చాడు. స్టేడియంలోని అభిమానులంతా అతడికి నీరాజనాలు పలుకుతున్నారు. అతడు భారతీయుడు కాదు. అయినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. అతడు ఫోర్ బాదినా.. బ్యాటు పైకెత్తినా.. ఏబీడీ ఏబీడీ.. అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు ఎవరో కాదు ఏబీ డివిలియర్స్ అని. సొంత జట్టుని కాదని భారత అభిమానులంతా అతడిని ఆదరించిన తీరుని చూస్తే.. అది కేప్టౌనా? లేక బెంగళూరా? అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయంటే అతియోశక్తి కాదు! అంతలా భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్న మిస్టర్ 360 నేటితో 36 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు.
నేడు ఏబీడీ పుట్టినరోజు సందర్భంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల సహా పలువురు ఆటగాళ్లు డివిలియర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ అయితే "హ్యాపీ బర్త్‌డే బ్రదర్" అంటూ ట్వీట్ చేశాడు. సామాజిక మాధ్యమాల వేదికగానూ ఇతడికి అభిమానుల నుంచి ట్వీట్లు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొన్ని విశేషాలివే...
భారత్ రెండో ఇళ్లు..
2004లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టాడు ఏబీ. దక్షిణాఫ్రికా తరఫున అతడు 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు బాదాడు.
దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన డివిలియర్స్.. నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లాడు. నేటికీ అతడు ఆర్‌సీబీ జట్టులోనే ఉన్నాడు. అందుకే బెంగళూరు అతడికి రెండో ఇల్లు అయ్యింది. ప్రపంచక్రికెట్ చరిత్రలో సచిన్ తెందుల్కర్, డివిలియర్స్ లాంటి కొద్ది మంది మాత్రమే దేశ సరిహద్దులు చెరిపి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.