గత నెలలో వెస్టిండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను డ్రా చేసుకున్న కోహ్లీసేన 5 రోజుల ఫార్మాట్లో అమీతుమీ తేల్చుకోనుంది. విశాఖ వేదికగా ఉదయం 9.30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ప్రయోగాలతో బరిలో దిగుతున్న కోహ్లీసేన..
ఈ మ్యాచ్‌లో కీలక మార్పులతో బరిలో దిగనుంది టీమిండియా. రోహిత్ శర్మను టెస్టు ఓపెనర్‌గా, తొలి టెస్టుకు రిషభ్ పంత్‌ను దూరంగా ఉంచి.. వృద్ధిమాన్ సాహాకు అవకాశం కల్పించి ప్రయోగం చేయనుంది. 22నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు సాహా.
ఓపెనర్‌గా పరిమిత ఓవర్లో విజయవంతమైన హిట్‌మ్యాన్ టెస్టుల్లోనూ సక్సెస్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయిన కారణంగా అతడు ఏ మాత్రం రాణిస్తాడో చూడాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో పదివేల పైగా పరుగులు చేసిన హిట్ మ్యాన్ 27 టెస్టుల్లో 39.62 సగటుతో 1585 పరుగులు చేశాడు.
కోహ్లీ, పుజారా, విహారి, సాహాతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్నారు. బుమ్రా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ పేస్ దళాన్ని నడిపించనున్నారు.