ఐసీసీ తాజాగా విడుదల చేసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 70.2 విజయశాతంతో టాపర్‌గా నిలిచింది ఇంగ్లాండ్. మంగళవారం టీమ్ఇండియాపై తొలి టెస్టు గెలిచిన అనంతరం టేబుల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంఫియన్‌షిప్ ఫైనల్లో అర్హత సాధించేందుకు ఆశల్ని సజీవం చేసుకుంది. ఇదే మ్యాచు ఫలితం కారణంగా రెండో స్థానంలో ఉన్న భారత్ 68.3 విజయ శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది.
కివీస్ ప్రత్యర్థి ఎవరు?
ఇప్పటికే న్యూజిలాండ్.. ఈ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరుకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. అయితే కివీస్ ప్రత్యర్థి స్థానం కోసం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి. కాగా ఇంగ్లాండ్.. ఈ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడాలంటే టీమ్ఇండియాపై 3-1,3-0,4-0 తేడాతో సిరీస్ గెలిచి తీరాలి. భారత్ అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్‌పై 2-1,3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలి. మరోవైపు భారత్-ఇంగ్లాండ్ సిరీస్ డ్రాగా ముగిసినా లేదా ఇంగ్లాండ్ 1-0, 2-1,2-0 తేడాతో గెలిచినా కంగారులకు అవకాశాలు ఉంటాయి. కాగా, ఈ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 70.0 విజయశాతంతో రెండో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా 69.2 విజయంశాతంతో మూడో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పాకిస్థాన్